Reading Time: < 1 minute
ఫైన్‌లు కాదు.. ఇక కటకటాలే.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వ్యక్తి 14 రోజుల జైలు శిక్ష!

తిరుపతి, సెప్టెంబర్ 24: ట్రాఫిక్ రూల్స్‌ను పెడచెవిని పెట్టి మద్యం సేవించి వాహనం నడిపినందుకు ఓ వ్యక్తికి తిరుపతి ప్రత్యేక జేఎస్‌సీఎం కోర్టు ఏకంగా 14 రోజుల జైల శిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే.. తాజాగా తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నగరంలో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్‌ టెస్ట్‌లు నిర్వహించారు పోలీసులు.. ఈ తనిఖీల్లో నగరి మండలం, ఓ.జి. కుప్పం పోస్టు పరిధిలోని కేజీ కుప్పం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు.

దీంతో అతనిపై మోటార్ వెహికల్స్ యాక్ట్ సెక్షన్ 185(a) కింద కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో ఈ విచారణ సందర్భంగా నిందితుడు నవీన్ కుమార్ కోర్టు ఎదుట తన నేరాన్ని అంగీకరించాడు. దీంతో మోటార్ వెహికల్స్ యాక్ట్ సెక్షన్ 185(b) కింద అతన్ని దోషిగా నిర్ధారించిన న్యాయస్థానం.. అతనికి 14 రోజుల పాటు సాధారణ జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.

ఈ సందర్భంగా గాజులమండ్యం పోలీసులు మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా రోడ్డు ప్రమాదాలు జరిగే ముప్పు పెరుగుతుందని, కాబట్టి వాహనదారులు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి మద్యం మత్తులో వాహనాలు నడిపితే కేసులు నమోదు చేసి, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వాహనదారులను హెచ్చరించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.