
హిందూ మహాసముద్రంపై యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. నిన్నమొన్నటి దాకా ఒక ప్రాంతానికే పరిమితమైన ఇరాన్- అమెరికా దాడులు… ఇప్పుడు సముద్ర జలాలను దాటుతున్నాయి. అమెరికా మళ్లీ దాడులకు దిగితే… ఈసారి యుద్ధం హిందూ మహాసముద్రం వరకు విస్తరిస్తుందని ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. కేవలం మిలిటరీ దాడులే కాదు… ఆర్థిక ఆంక్షలతో అమెరికా ఉక్కిరిబిక్కిరి చేస్తుండటంతో ఇరాన్ ప్రతీకార చర్యలకు సిద్ధమవుతోంది. ఇరాన్ అన్నంత పని చేస్తే ఆ ప్రభావం భారత్ సహా అనేక దేశాలపై నేరుగా ఉంటుంది.
పశ్చిమాసియా యుద్ధం భౌగోళిక సరిహద్దులు దాటుతోంది. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ సలహాదారు రహీమ్ సఫవీ అమెరికాకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. అమెరికా మళ్లీ దాడులకు పాల్పడితే… యుద్ధం హిందూ మహాసముద్రం వరకు చేరుకుంటుందని ఫార్స్ న్యూస్ ఏజెన్సీ విడుదల చేసిన వీడియోలో ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే పెర్షియన్ గల్ఫ్ హార్ముజ్ జలసంధి నుంచి ఈ వివాదం ఎర్ర సముద్రానికి పాకింది. ఇప్పుడు ఏకంగా హిందూ మహాసముద్రం పేరును ఇరాన్ సలహాదారు బహిరంగంగా ప్రస్తావించడం ఇదే తొలిసారి. ఇరాన్ కు సుమారు 4 వేల కిలోమీటర్ల దూరంలో… హిందూ మహాసముద్రంలోని డియెగో గార్సియాలో అమెరికా, బ్రిటన్ మిలిటరీ బేస్ ఉంది. తాజా హెచ్చరికలతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
వాణిజ్య మార్గాలపై ఆధిపత్యం ఇప్పుడు ప్రధాన ఆయుధంగా మారింది. సౌదీ మద్దతు ఉన్న ప్రభుత్వ బలగాలతో పోరాడుతున్న యెమెన్ హౌతీలు… ఎర్ర సముద్ర తీరాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆసియా, యూరప్ ఖండాలను సూయజ్ కెనాల్ ద్వారా కలిపే అత్యంత కీలకమైన బాబ్ ఎల్-మండేబ్ జలసంధిపై హౌతీలు తమ పట్టును మరింత బిగించారు. ఫిబ్రవరి చివర్లో జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ కూడా హార్మూజ్ జలసంధిని దిగ్బంధించింది. ప్రపంచ చమురు, గ్యాస్ రవాణాలో కీలకమైన ఈ హార్మూజ్ జలసంధిపై నియంత్రణ కోసం ఇప్పుడు అమెరికా, ఇరాన్ తీవ్రంగా పోటీ పడుతున్నాయి.
సరిహద్దుల్లో సైనిక మోహరింపులతో పాటు ఇరాన్ పై ఆర్థిక యుద్ధం కూడా తీవ్రమైంది. ఇరాన్ ఎయిర్‌లైన్స్‌పై అమెరికా ఆంక్షలు విధించింది. ఇరాన్ ఎయిర్‌లైన్స్‌తో ప్రపంచ దేశాల సంస్థలు వ్యాపారం చేయకుండా అడ్డుకునేందుకు యూఎస్ ట్రెజరీ సెప్టెంబర్ 23ని డెడ్‌లైన్‌గా విధించింది. డెడ్ లైన్ ముగియడంతో దుబాయ్ లాంటి గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన ఇరాన్ విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీనిపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. అమెరికా నిషేధాన్ని పాటించే పొరుగు దేశాలపై ప్రతీకారం తీర్చుకుంటామని బెదిరింపులకు దిగింది. ఏ దేశమైనా అమెరికా ఆంక్షలు అమలు చేస్తే… ఆయా దేశాల ఎయిర్‌పోర్టులను నిరుపయోగంగా మారుస్తామని ఇరాన్ హెచ్చరించింది. అమెరికా బెదిరింపులు.. ఇరాన్ హెచ్చరికలు చూస్తుంటే… యుద్ధం కొత్త మలుపు తీసుకుని మరింత వినాశనాన్ని సృష్టించే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది.