Reading Time: 2 minutes
Dhruv Jurel On Vaibhav Suryavanshi No Jealousy No Comparison

Dhruv Jurel praises Vaibhav Suryavanshi: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వైభవ్‌తో కలిసి ఆడటం ఎలా అనిపిస్తుందని అడిగిన ప్రశ్నకు జురెల్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. 15 ఏళ్ల వయసులోనే అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడని ప్రశంసించాడు. అతడిని చూసి తామంతా ఆశ్చర్యపోతుంటాం అని చెప్పాడు. అందరి ప్రశంసలకు వైభవ్ పూర్తి అర్హుడు అని పేర్కొన్నాడు. అయితే వైభవ్‌పై తనకు ఎలాంటి జెలసీ (ఈర్ష్య), పోలికలు లేవని జురెల్ స్పష్టం చేశాడు.

ఎలాంటి జెలసీ లేదు:

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ధ్రువ్ జురెల్, వైభవ్ సూర్యవంశీలు మాజీ ఛాంపియన్ రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వైభవ్ కోసం రాజస్థాన్ రూ.1.1 కోట్లు ఖర్చు చేయగా.. అతడు తనపై ఉంచిన నమ్మకాన్ని అద్భుతమైన ప్రదర్శనలతో నిలబెట్టుకున్నాడు. ఐపీఎల్‌తో పాటు భారత్ అండర్-19, ఇండియా-ఏ జట్ల తరఫున కూడా వైభవ్ ఆకట్టుకునే ప్రదర్శనలు ఇచ్చి జాతీయ జట్టులో చోటు సంపాదించాడు. ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా యూట్యూబ్ ఛానెల్‌లో ధ్రువ్ జురెల్ మాట్లాడుతూ.. వైభవ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘వైభవ్ ప్రశంసలకు అర్హుడు. అతడు ఆడుతున్న తీరును అసలు ఊహించలేం. 15 ఏళ్ల పిల్లాడు టాప్ బౌలర్లను కూడా చిత్తు చేస్తున్నాడు. అది నిజంగా అద్భుతం. ఇందులో ఎలాంటి జెలసీ లేదు. పోలికలు కూడా లేవు. ఎందుకంటే పోల్చుకోవడానికి ఏముంది?. అతడు మన ఊహకు అందని స్థాయిలో ఉన్నాడు. వైభవ్ గొప్ప ఆటగాడు. మేమంతా అతడిని చూసి ఆశ్చర్యపోతుంటాం. అతడు మా బ్యాటర్ల పనిని సులభం చేస్తున్నాడు’ అని జురెల్ పేర్కొన్నాడు.

ఆపకుండా బాదుతూనే ఉంటాడు:
వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తనపై కూడా ప్రభావం పడుతుందని జురెల్ చెప్పాడు. ‘పవర్‌ప్లేలో వైభవ్ బౌలర్లపై విరుచుకుపడుతుంటే.. మేము కూడా అవకాశం వచ్చినపుడు దూకుడుగా ఆడాలనే ఉత్సాహం కలుగుతుంది. వైభవ్ వరుసగా బౌండరీలు కొడుతుంటాడు. అతడిని చూస్తుంటే మాకు కూడా భారీ షాట్లు ఆడాలి అనిపిస్తుంది. ఎందుకంటే వైభవ్ ఆపకుండా బాదుతూనే ఉంటాడు’ అని జురెల్ చెప్పాడు. వైభవ్ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. జూలైలో ఇంగ్లండ్ పర్యటనలో టీ20 అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అతడు.. ఆ సిరీస్‌లో 14, 13, 15 పరుగులు చేశాడు. ఆ తర్వాత జింబాబ్వేతో జరిగిన సిరీస్‌లో మాత్రం సత్తా చాటాడు. మూడు మ్యాచ్‌ల్లో 151 పరుగులు సాధించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. చివరి మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా అందుకున్నాడు.

ప్లేయింగ్ ఎలెవన్‌లో కష్టమే:
అయితే ఆ తర్వాత ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో వైభవ్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో గెలిచినప్పటికీ.. వైభవ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. అతడి స్థానంలో సంజు శాంసన్ తిరిగి జట్టులోకి వచ్చి అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేశాడు. ప్రస్తుతం వైభవ్ ఆసియా క్రీడలు 2026 కోసం ఎంపిక చేసిన భారత జట్టులో ఉన్నాడు. అయితే తుది జట్టులో సంజు వంటి సీనియర్ ఆటగాడు ఉండటం వల్ల వైభవ్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం వస్తుందో లేదో అన్నది ఆసక్తికరంగా మారింది.