Reading Time: 3 minutes

మధ్యాహ్నం 12లోపే మహా గణపతి నిమజ్జనం… హైదరాబాద్లో 20 వేల మంది పోలీసులతో బందోబస్తు

Caption of Image.
  • 10 వేల సీసీ కెమెరాలు.. 26 షీటీమ్స్‌‌, 24 డ్రోన్లతో నిఘా
  •  20 వేల మంది పోలీసులతో బందోబస్తు
  • మూడు షిఫ్టుల్లో 26 షీటీమ్స్‌‌ బృందాలు  
  • 234 మంది హైడ్రా స్విమ్మర్లు,51 డీఆర్ఎఫ్ బృందాలు రెడీ 
  • డీజేలు, పటాకులపై నిషేధం…

హైదరాబాద్‌‌ సిటీ, వెలుగు : వినాయక నిమజ్జన శోభాయాత్రకు హైదరాబాద్‌‌ సిటీ సిద్ధమైంది. శుక్రవారం జరిగే ప్రధాన నిమజ్జనాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు పోలీస్‌‌, జీహెచ్ఎంసీ, హైడ్రా, జలమండలి, విద్యుత్‌‌, అగ్నిమాపక తదితర శాఖలు విస్తృత ఏర్పాట్లు చేశాయి. సిటీ నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా విగ్రహాలు తరలివచ్చే అవకాశం ఉండడం, లక్షలాది మంది భక్తులు పాల్గొనే మహత్తర ఘట్టం కావడంతో భద్రత, ట్రాఫిక్‌‌ నియంత్రణ, తాగునీరు, రెస్క్యూ సేవలపై ప్రత్యేక దృష్టి సారించారు. 

ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.దాహార్తిని తీర్చేందుకు నగరవ్యాప్తంగా వాటర్​బోర్డు 137 ప్రత్యేక క్యాంప్​లు ఏర్పాటు చేసింది. ఈ క్యాంపుల ద్వారా 40 లక్షల వాటర్‌‌ ప్యాకెట్లను సిద్ధం చేశారు. డ్రమ్ముల ద్వారా కూడా మంచినీటిని సరఫరా చేయనున్నారు.  

మూడు కార్పొరేషన్లలో ఇలా…

జీహెచ్‌‌ఎంసీ పరిధిలో 39 నిమజ్జన కేంద్రాల వద్ద 110 స్టాటిక్‌‌, 170 మొబైల్‌‌ క్రేన్లను ఏర్పాటు చేసింది. పోలీస్‌‌ శాఖతో సమన్వయంతో 12 జాయింట్‌‌ కంట్రోల్‌‌ రూమ్‌‌లు ఏర్పాటు చేశారు. ఊరేగింపు మార్గాల్లో ప్రతి 3–4 కిలోమీటర్లకు ఒకటి చొప్పున 136 గణేశ్‌‌ యాక్షన్‌‌ టీమ్‌‌లను ఏర్పాటు చేశారు. నిమజ్జన ప్రాంతాల్లో 770 మంది పారిశుద్ధ్య సిబ్బంది 24 గంటలూ డ్యూటీలు చేయనున్నారు. చెత్త తొలగింపునకు 6 వేల మంది స్వీపింగ్‌‌ సిబ్బందితోపాటు 42 మినీ టిప్పర్లు, 10 జేసీబీలను అందుబాటులో ఉంచారు. నిమజ్జన ప్రాంతాలు, ఊరేగింపు మార్గాల్లో 287 మొబైల్‌‌ టాయిలెట్లు, 43,270 తాత్కాలిక లైట్లు ఏర్పాటు చేశారు. అత్యవసర సేవల కోసం అంబులెన్స్‌‌లు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. 

ఊరేగింపు మార్గాల్లో చెట్ల కొమ్మల తొలగింపునకు ప్రతి సర్కిల్‌‌కు అత్యవసర హార్టికల్చర్‌‌ బృందాలను రెండు షిఫ్టుల్లో ఏర్పాటు చేశారు. హుస్సేన్‌‌సాగర్ చుట్టూ జీహెచ్ఎంసీ 51 క్రేన్లను ఏర్పాటు చేసింది. ట్యాంక్ బండ్ పై 15, ఎన్టీఆర్ మార్గ్‌‌లో 9, పీవీ మార్గ్‌‌లో 9 ఏర్పాటు చేయగా బేబీ పాండ్స్ వద్ద ఆరు క్రేన్లను ఏర్పాటు చేశారు. మరో రెండు రిజర్వులో ఉంచారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటివరకు 32, 878 విగ్రహాల నిమజ్జనాలు పూర్తి కాగా, ఐదడుగుల లోపు 52,158, అంతకంటే ఎత్తైనవి 25,529 విగ్రహాలు నిమజ్జనానికి వస్తాయని అంచనా.  

సీఎంసీలో ఇప్పటికే లక్ష విగ్రహాల నిమజ్జనం !

సైబరాబాద్​మున్సిపల్​కార్పొరేషన్​పరిధిలో 53 నిమజ్జన కేంద్రాల్లో సోమవారం నాటికి లక్ష విగ్రహాల నిమజ్జనం పూర్తి కాగా, మరో 1,36,743 విగ్రహాలు వస్తాయని అంచనా. మొత్తంగా 82 క్రేన్లను అందుబాటులో ఉంచారు. ఇక్కడ 1,145 మంది పారిశుద్ధ్య సిబ్బందిని మూడు షిఫ్టుల్లో విధుల్లో నియమించారు. మల్కాజిగిరి పరిధిలో 39 నిమజ్జన ప్రాంతాల్లో 84 క్రేన్లను రెడీ చేశారు. ఇప్పటికే 10 వేల నిమజ్జనాలు కాగా, మరో 25 వేల విగ్రహాలు వస్తాయని అనుకుంటున్నారు. పారిశుద్ధ్య నిర్వహణ కోసం 1,356 మంది సిబ్బందిని మూడు షిఫ్టుల్లో 24 గంటల పాటు విధుల్లో ఉంచనున్నారు. 

హుస్సేన్ సాగర్ వద్ద నిరంతర కరెంట్

హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో టీజీఎస్పీడీసీఎల్ నిరంతరాయ కరెంట్​సరఫరా చేయనున్నది. దీనికి సంబంధించి ఎన్‌‌టీఆర్ మార్గ్‌‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యాంప్ ఆఫీసును సీఎండీ జితేష్ వి.పాటిల్ ప్రారంభించారు. రోడ్లపై ఉండే కరెంట్​వైర్ల ఎత్తు పెంచారు. వేలాడుతున్న సర్వీస్ వైర్లను సరిచేశారు. ఘాట్ల వద్ద హై-మాస్ట్ లైట్లు, స్ట్రీట్ లైట్లు, అదనపు ట్రాన్స్‌‌ఫార్మర్లు ఏర్పాటు చేశారు. ప్రత్యేక కంట్రోల్ రూమ్‌‌లు ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితి, ప్రమాదం గుర్తిస్తే 1912 హెల్ప్‌‌లైన్ నంబర్‌‌కు కాల్ చేయాలని సూచించారు. 

20 వేల మంది పోలీసులతో బందోబస్తు

వివిధ ప్రాంతాల నుంచి వచ్చే విగ్రహాల ఊరేగింపుల కోసం హైదరాబాద్‌‌ కమిషనరేట్‌‌కు చెందిన లా అండ్‌‌ ఆర్డర్‌‌, ట్రాఫిక్‌‌, టాస్క్‌‌ఫోర్స్‌‌, స్పెషల్‌‌ బ్రాంచ్‌‌, సిటీ సెక్యూరిటీ వింగ్‌‌, సీఏఆర్‌‌ తదితర విభాగాలకు చెందిన సుమారు 20 వేల మంది పోలీసులు విధుల్లో ఉండనున్నారు. ఇతర జిల్లాల నుంచి మరో 8,142 మంది అధికారులు, సిబ్బందిని రప్పించి 42 ప్లాటూన్లుగా ఏడు జోన్లలో మోహరించారు. చార్మినార్‌‌, గోల్కొండ, రాజేంద్రనగర్‌‌, శంషాబాద్‌‌ ప్రాంతాల్లో నాలుగు ఆర్‌‌ఏఎఫ్‌‌ కంపెనీలు, ఖైరతాబాద్‌‌, సికింద్రాబాద్‌‌లో రెండు సీఆర్‌‌పీఎఫ్‌‌ కంపెనీలను మోహరించారు. 

53 బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్​లు కూడా బందోబస్తులో పాల్గొననున్నాయి. శోభాయాత్రను పర్యవేక్షించేందుకు ప్రధాన మార్గాల్లో 10 వేల సీసీ కెమెరాలను బంజారాహిల్స్‌‌లోని ఐసీసీసీ కంట్రోల్‌‌ రూమ్‌‌కు అనుసంధానించారు. కీలక ప్రాంతాల్లో 24 డ్రోన్లతో నిఘా కొనసాగించనున్నారు. 100 హైరైజ్‌‌ కెమెరాలను ఏర్పాటు చేసి విగ్రహాల రాకను కూడా పర్యవేక్షిస్తున్నారు. ఎన్టీఆర్‌‌ మార్గ్‌‌, పీపుల్స్‌‌ ప్లాజా, నెక్లెస్‌‌ రోడ్‌‌, మొఘల్‌‌పురా స్పోర్ట్స్‌‌ కాంప్లెక్స్‌‌ వద్ద కంట్రోల్‌‌ రూమ్‌‌లు ఏర్పాటు చేశారు. 

హుస్సేన్‌‌సాగర్‌‌లో 150 మంది స్విమ్మర్లు  

.నిమజ్జనం కోసం హైడ్రా 234 మంది స్విమ్మర్లను రంగంలోకి దించింది. ఒక్క హుస్సేన్‌‌సాగర్‌‌లోనే 150 మందిని మూడు షిఫ్టుల్లో 50 మంది చొప్పున విధుల్లో ఉంచుతున్నారు. సీఎంసీ పరిధిలో 84 మంది స్విమ్మర్లను అందుబాటులో ఉంచారు. వీరికి అదనంగా 51 డీఆర్ఎఫ్‌‌ టీమ్స్‌‌ను సిద్ధంగా ఉంచారు. హుస్సేన్‌‌సాగర్‌‌తో పాటు సిటీలోని ప్రధాన చెరువుల్లో రెస్క్యూ బృందాలను మోహరించారు. కూకట్‌‌పల్లిలోని ఐడీఎల్‌‌ చెరువులో సుమారు 25 అడుగుల మేర తవ్వకాలు చేపట్టి నిమజ్జనానికి అనువుగా ఏర్పాట్లు చేశారు.

అందరి చూపు ఖైరతాబాద్ మహాగణపతి వైపే..

నిమజ్జనోత్సవంలో అందరి చూపు ఖైరతాబాద్ శ్రీ పంచముఖ సంకట హర మహాగణపతి వైపే ఉంది. బుధవారం అర్ధరాత్రి నుంచే దర్శనాలు బంద్​చేసినా గురువారం కూడా భక్తులు తరలివచ్చారు. భారీ టస్కర్​పై వినాయకుడిని నిలిపేందుకు వెల్డింగ్​పనులు పూర్తి కావచ్చాయి. మహాగణపతి శోభాయాత్ర శుక్రవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమై.. మధ్యాహ్నం 12 గంటలకు పూర్తయ్యేలా ఆఫీసర్లు ప్లాన్​చేశారు. 

ఈ ర్యాలీ పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి ఎక్బాల్ మినార్ చౌరస్తా, తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ జంక్షన్ మీదుగా కొనసాగి.. అంబేద్కర్ విగ్రహం నుంచి ఎన్‌‌టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ మీదుగా నాలుగో నంబర్​క్రేన్​వద్దకు చేరుకుంటుంది. బందోబస్తు కోసం 204 మంది పోలీసులను నియమించారు. 15 పుషింగ్ పార్టీ వాహనాలు, నాలుగు మొబైల్ క్రేన్లు, 16 ఫుట్ పెట్రోలింగ్ పార్టీలు, ఐదు పికప్ వాహనాలను వినియోగించనున్నారు.  

రాజకీయ పార్టీల పాటలు పెడితే చర్యలు 

నిమజ్జన ఊరేగింపులో ఎలాంటి రాజకీయ పార్టీలకు సంబంధించిన పాటలు, అశ్లీల సాంగ్స్ పెట్టవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్​ఇప్పటికే ప్రకటించారు. ఇలాంటి పాటల వల్ల నిమజ్జన వేడుకల్లో ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉందని వార్నింగ్​ఇచ్చారు. డీజే వాహనాలను, సౌండ్ సిస్టమ్‌‌లను సీజ్​చేస్తామని, సౌండ్ సిస్టమ్స్ సరఫరా చేసిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. 

©️ VIL Media Pvt Ltd.