Reading Time: < 1 minute

ములుగు జిల్లాలో ఒక్కసారిగా భారీగా వరద.. గోదావరి లంకలో చిక్కుకున్న 80 మంది కూలీలు, రైతులు

Caption of Image.

ములుగు: ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో గోదావరి ఇసుకపాయలోకి ఒక్కసారిగా భారీగా వరద వచ్చింది. మిర్చి తోటలకు పనులకు వెళ్లిన కూలీలు వరద ఉధృతి కారణంగా గోదావరి అవతలి ఒడ్డున చిక్కుకున్నారు.

ఎస్సై తిరుపతిరెడ్డి, తహసీల్దార్ వేణుగోపాల్లకు కూలీలు సమాచారం అందించారు. నాటు పడవల సహాయంతో కూలీలను , రైతులను పోలీసులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. గోదావరి వరద ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రైతులు ఎవరు కూడా మిర్చి తోటలకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.

భద్రాచలం దగ్గర గోదావరి నది ఉధృతి క్రమంగా పెరుగుతోంది. గంటకు ఒక అడుగు చొప్పున పెరుగుతుండగా.. శనివారం మధ్యాహ్నం 3 గంటల వరకు గోదావరి నీటిమట్టం 24.90 అడుగులకు చేరుకుంది.

భద్రాచలానికి ఎగువన ఉన్న ఇంద్రావతి, ప్రాణహిత ఉపనదుల నుంచి వస్తున్న నీటితో సుమారు 10 లక్షల క్యూసెక్కుల ప్రవాహం దిగువకు వెళ్తోంది. చర్ల మండలం వీరాపురం వద్ద గోదావరి లంకల్లోని కోరెగడ్డలో వ్యవసాయ కూలీలు వరద నీటిలో చిక్కుకుపోయారు.

©️ VIL Media Pvt Ltd.