Reading Time: < 1 minute

ఆ నాలుగు రాష్ట్రాల నుంచి పురుష అభ్యర్థులను ఉద్యోగాలకు తీసుకోం.. బెంగళూరు సీఈఓ షాకింగ్ ప్రకటన

Caption of Image.

ఉద్యోగాల నియామకాల విషయంలో బెంగళూరుకు చెందిన కంపెనీ సీఈవో చేసిన ప్రకటన సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారి పెద్ద డిబేట్ కు దారి తీసింది. తమ కంపెనీ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి పురుషలను ఉద్యోగాలకు తీసుకోమని ప్రకటించడమే ఈ చర్చకు కారణం.

 ఎ1 స్పోర్ట్స్ వరల్డ్ అనే సంస్థ వ్యవస్థాపకుడు కార్తీక్ ఎస్‌జీ (కార్తీక్ షెనాయ్) ఇటీవల ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేసిన  ప్రకటన సోషల్ మీడియాలో  తీవ్ర చర్చకు దారితీసింది.  ఈ నిర్ణయం ఎన్నో చర్చలు, వాదోపవాదాల తర్వాత తీసుకున్నట్లు  తెలిపారు. ఒక మాజీ ఉద్యోగి ప్రవర్తన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఆ ఉద్యోగి మహిళా  ఉద్యోగుల పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు చెప్పారు. ఎన్నిసార్లు హెచ్చరించినా  మారలేదని, ఒక మహిళా ఉద్యోగిపై లైంగికంగా వేధింపులకు పాల్పడినట్లు  ఆరోపించారు.   

సంస్థలో ఇప్పటికే రాజస్థాన్‌కు చెందిన ఒక మహిళా ఉద్యోగి ఉందనీ.. కంపెనీ  నిర్ణయానికి మద్దతు ఇచ్చినట్లు కార్తీక్ పేర్కొన్నారు. తన సంస్థ పిల్లల కోసం స్పోర్ట్స్ కార్యక్రమాలు నిర్వహిస్తుందని, ఉద్యోగుల భద్రత ప్రధాన అంశమని అన్నారు. సంస్థలో ప్రస్తుతం 32 మంది ఉద్యోగులు ఉండగా అందులో 14 మంది మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది.

సీఈఓ ప్రకటన వైరల్ కావడంతో.. సోషల్ మీడియాలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒక వ్యక్తి చేసిన తప్పుకు మొత్తం ఆ రాష్ట్రాల యువతపై ప్రభావం చూపవద్దని అంటున్నారు.  వ్యక్తి రాష్ట్రం ఆధారంగా నియామకాలు చేయడం సరైనదేనా అని ప్రశ్నించారు. మరికొందరేమో ఆఫీస్ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆయన తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించారు.  

©️ VIL Media Pvt Ltd.