
Nani: ‘దసరా’ తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన పాన్ ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’ ప్రస్తుతం ఈ చిత్రం థియేటర్లలో దూసుకుపోతుంది. చిత్ర బృందం తాజాగా నిర్వహించిన ‘మీడియా ములాఖత్’ వేదికపై హీరో నాని మాట్లాడుతూ.. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో తనకున్న అనుబంధంపై అత్యంత ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. దర్శకుడికి మితిమీరిన స్వేచ్ఛ ఇస్తారన్న ప్రచారంపై నాని సూటిగా మాట్లాడారు. “నేను శ్రీకాంత్‌ను తెగ పాంపర్ చేసేస్తానని, వాడు ఏది అడిగితే అది చేసేలా మితిమీరిన ఫ్రీడమ్ ఇచ్చేస్తానని బయట చాలామంది అనుకుంటారు. కానీ అసలు నిజం వేరు. నేను శ్రీకాంత్‌తో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాను. మా నాన్న నాతో ఎంత కఠినంగా వ్యవహరించేవాడో, నేను కూడా శ్రీకాంత్ విషయంలో అంతే స్ట్రిక్ట్‌గా ఉంటాను” అని అన్నారు. తన కొడుకు జున్నును ఎంతో గారాబం చేస్తానని, కానీ తనలోని ‘నాన్న’ మాత్రం శ్రీకాంత్ దగ్గరే బయటకు వస్తాడని నాని అన్నారు. “శ్రీకాంత్ మా సొంత కుర్రాడు. మా నాన్న జీవితంలో నన్ను ఎప్పుడూ పొగడలేదు. మరి అలాంటప్పుడు నేను శ్రీకాంత్‌ను ఎందుకు పొగడాలి? అందుకే వాడిని నేను అస్సలు పొగడను” అంటూ దర్శకుడిపై తనకున్న ప్రత్యేకమైన ప్రేమను, బాధ్యతను చాటుకున్నారు.
“వాడు ఒరిజినల్ పీస్.. తప్పు చేస్తే ఒప్పుకుంటాడు”
శ్రీకాంత్ ఓదెలలోని మేకింగ్ స్టైల్‌ను ప్రస్తావిస్తూ.. “శ్రీకాంత్ చాలా ఒరిజినల్ పీస్. ఒక పని తప్పు అయినా, ఒప్పయినా పూర్తి కన్విక్షన్‌తో ప్రాణం పెట్టి చేస్తాడు. చుట్టుపక్కల వాళ్లు ఏదో అన్నారని ప్రభావితం కాడు. పొరపాటు జరిగితే వెంటనే రియలైజ్ అవుతాడు. అలాంటి లక్షణం ఉండటం ఇండస్ట్రీలో చాలా అరుదు” అని నాని అన్నారు. సుకుమార్ స్కూల్ నుంచి ఎలాగైతే ప్రతిభావంతులైన దర్శకులు వచ్చారో, భవిష్యత్తులో ‘శ్రీకాంత్ స్కూల్’ నుంచి కూడా అలాంటి కొత్త దర్శకుల లిస్ట్ బయటకు రావాలని తాను కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారు. ‘ది ప్యారడైజ్’ ప్రాజెక్ట్ నాని ఒక్కడి చుట్టూనే తిరిగే సినిమా కాదని ఆయన స్పష్టం చేశారు. “నాకైతే షాట్ కాగానే గొడుగు పట్టుకునే వాళ్లు ఉన్నారు, వెంటనే క్యారవాన్‌కు వెళ్లిపోయే సౌకర్యం ఉంది. కానీ ఈ సినిమాలో చిన్న పాత్రలు వేసిన వాళ్లు, జూనియర్ ఆర్టిస్టులు రోజులు తరబడి ఆ బురదలో, వర్షంలో, బ్లడ్‌లోనే తడిసి ముద్దవుతూ కష్టపడ్డారు. వాళ్లే ఈ సినిమాకు నిజమైన హీరోలు” అని అన్నారు.
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి మాట్లాడుతూ.. “సినిమా రఫ్ ఎడిట్ చూస్తున్నప్పుడు మోహన్ బాబు గారి క్యారెక్టర్‌కు వేరే ఎవరో ట్రాక్ డబ్బింగ్ చెప్పారు. ఆ సన్నివేశాలు రాగానే నాకు స్క్రీన్ వైపు అస్సలు చూడబుద్ధి కాలేదు. మోహన్ బాబు గారి ముఖంపై వేరే వాళ్ల వాయిస్‌ని ఊహించడం కూడా అసాధ్యం. ఆయన ఒరిజినల్ వాయిస్ పడి చెవులు తూట్లు పడేలా డైలాగ్ వినిపిస్తేనే ఆ హై వస్తుంది, ఆ కిక్ వస్తుంది. బయట మోహన్ బాబు గురించి చాలా స్ట్రిక్ట్ అని భయపెట్టే ప్రచారం ఉంది, కానీ ఆయన లోపల ఎంతో సున్నితమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. ఆయన తన అసలైన ప్రేమని ఎందుకు బయటకు రానివ్వరో అర్థం కాదు. ఆ విషయం బయటపడితే అందరూ ఆయన ప్రేమలో పడిపోతారని బహుశా భయం పెట్టుకొని ఆ ఇమేజ్‌ను మైంటైన్ చేస్తున్నారేమో” అంటూ నవ్వులు పూయించారు. ఈ సినిమాకు నేను హీరోని కావచ్చు.. కానీ నా పైన ఉన్న హీరో మాత్రం మోహన్ బాబు గారే అని గౌరవాన్ని ప్రకటించారు. ఫస్ట్ షో నుంచి మిక్సిడ్ టాక్ మొదలైనా షో షోకీ పాజిటివిటీ పెరుగుతోందని, 2026లో ఏ వేదిక చూసినా ‘ది ప్యారడైజ్’ గురించే అతిపెద్ద చర్చ జరుగుతోందని నాని ధీమా వ్యక్తం చేశారు.