
Rohit Sharma Records: భారత్, వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్ సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభం కానుంది. తిరువనంతపురంలో జరిగే తొలి వన్డేలో టీమిండియా బరిలోకి దిగనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 30న గువాహటి, అక్టోబర్ 3న ముల్లన్‌పూర్‌లో వన్డేలు జరగనున్నాయి. అయితే ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌పై అందరి దృష్టి నెలకొంది.
ఇందులో ముఖ్యంగా 39 ఏళ్ల రోహిత్ శర్మకు ఇప్పటికే వన్డే క్రికెట్‌లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా ప్రత్యేక గుర్తింపు ఉంది.. 2027 వన్డే ప్రపంచకప్‌లో అతడి స్థానం ఇంకా ఖరారు కాని నేపథ్యంలో వెస్టిండీస్‌తో సిరీస్‌లో రోహిత్ సాధించే రికార్డులు ఆసక్తికరంగా మారాయి. మరి ఆ రికార్డ్స్ ఏంటో ఒక లుక్ వేద్దామా..
ఓపెనర్‌గా 10 వేల పరుగులు..
రోహిత్ శర్మ ఇప్పటివరకు వన్డేల్లో 11,895 పరుగులు చేశాడు. ఇందులో ఓపెనర్‌గా భారత్ తరఫున 9,865 పరుగులు సాధించాడు. మరో 135 పరుగులు చేస్తే వన్డేల్లో ఓపెనర్‌గా 10 వేల పరుగులు పూర్తి చేసిన నాలుగో ఆటగాడిగా రోహిత్ నిలుస్తాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ 15,310 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. సనత్ జయసూర్య 12,740, క్రిస్ గేల్ 10,179 పరుగులతో ముందున్నారు.
వెస్టిండీస్‌పై నాలుగో సెంచరీ
వెస్టిండీస్‌పై రోహిత్ శర్మ 35 వన్డే ఇన్నింగ్స్‌లో 1,613 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. ఈ సిరీస్‌లో మరో సెంచరీ సాధిస్తే వెస్టిండీస్‌పై వన్డేల్లో నాలుగు సెంచరీలు చేసిన భారత బ్యాటర్ల జాబితాలో చేరతాడు. ప్రస్తుతం సచిన్ టెండూల్కర్ వెస్టిండీస్‌పై నాలుగు సెంచరీలు చేయగా, విరాట్ కోహ్లీ ఏకంగా తొమ్మిది సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. రాహుల్ ద్రవిడ్, యువరాజ్ సింగ్ కూడా వెస్టిండీస్‌పై మూడు సెంచరీలు చేశారు.
మరో 6 సిక్సర్లు కొడితే
సిక్సర్ల విషయంలోనూ రోహిత్ శర్మకు అరుదైన రికార్డు అందుబాటులో ఉంది. వెస్టిండీస్‌పై ఇప్పటివరకు 35 సిక్సర్లు బాదిన రోహిత్.. మరో ఆరు సిక్సర్లు కొడితే 41 సిక్సర్లతో ఈ జాబితాలో అగ్రస్థానానికి చేరుకుంటాడు. ప్రస్తుతం వెస్టిండీస్‌పై వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా ఏబీ డివిలియర్స్ 40 సిక్సర్లతో ఉన్నాడు.
మరో మూడు మైలురాళ్లు
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ మరికొన్ని కీలక మైలురాళ్లను కూడా అందుకునే అవకాశం ఉంది. వన్డేల్లో సెంచరీ చేసిన అత్యంత వయసున్న భారత ఆటగాడిగా నిలిచే అవకాశం అతడి ముందుంది. అలాగే వెస్టిండీస్‌పై వన్డే సెంచరీ చేసిన అత్యంత వయసున్న ఆటగాడిగానూ రికార్డు సాధించే ఛాన్స్ ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌లో 2,000 ఫోర్లు పూర్తి చేయడానికి కూడా రోహిత్ మరో 18 బౌండరీల దూరంలో ఉన్నాడు.
భారత్-వెస్టిండీస్ పూర్తి షెడ్యూల్
వన్డే సిరీస్:
సెప్టెంబర్ 27: తొలి వన్డే – తిరువనంతపురం – మధ్యాహ్నం 2 గంటలు
సెప్టెంబర్ 30: రెండో వన్డే – గువాహటి – మధ్యాహ్నం 2 గంటలు
అక్టోబర్ 3: మూడో వన్డే – న్యూ చండీగఢ్ – మధ్యాహ్నం 2 గంటలు
టీ20 సిరీస్:
అక్టోబర్ 6: తొలి టీ20 – లక్నో – రాత్రి 7 గంటలు
అక్టోబర్ 9: రెండో టీ20 – రాంచీ – రాత్రి 7 గంటలు
అక్టోబర్ 11: మూడో టీ20 – ఇండోర్ – రాత్రి 7 గంటలు
అక్టోబర్ 14: నాలుగో టీ20 – హైదరాబాద్ – రాత్రి 7 గంటలు
అక్టోబర్ 17: ఐదో టీ20 – బెంగళూరు – రాత్రి 7 గంటలు