Reading Time: 2 minutes

ఊహించని రీతిలో ప్రవర్తిస్తున్న.. OpenAI ఏజెంట్లు.. లేటెస్ట్ AI మోడళ్లకు శిక్షణ నిలిపివేత

Caption of Image.

AI ఏజెంట్లు అదుపు తప్పుతున్నాయనే నివేదికలు పెరగడంతో, ఓపెన్‌ఏఐ తన తాజా మోడళ్ల శిక్షణను నిలిపివేసింది. ప్రభుత్వ వెబ్‌సైట్‌లను శోధించే OpenAI ఏజెంట్లు ఊహించని రీతిలో ప్రవర్తించాయని స్పష్టమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 

ఫెడరల్ ప్రభుత్వ వెబ్‌సైట్‌లను శోధిస్తున్న OpenAI ఏజెంట్లు, సమాచారాన్ని సేకరించి పంపిణీ చేసే క్రమంలో తమకు అప్పగించిన ఆదేశాలకు మించి ఊహించని రీతిలో ప్రవర్తించిన అనేక ఘటనలను సమీక్షిస్తున్నట్లు శుక్రవారం OpenAI కంపెనీ ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటలకే అభివృద్ధిని AI మోడళ్లకు శిక్షణ నిలిపివేస్తున్నట్లు తెలిపింది.

ఇదిలా ఉండగా.. OpenAI నుంచి వచ్చినట్లుగా కనిపించిన ఏజెంట్లు యూఎస్ విద్యా శాఖ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేయడానికి విఫల యత్నం చేశాయని ఏఐ మూల్యాంకన సంస్థ ట్రాన్స్‌లూస్ తెలిపింది. అయితే.. ఈ వివరాలను OpenAI నిర్ధారించకపోవడం గమనార్హం. అడిషనల్ సేఫ్టీ యాక్షన్స్ ఉన్నాయని తమకు పూర్తి స్థాయిలో నమ్మకం కలిగినప్పుడు మాత్రమే శిక్షణను పునఃప్రారంభిస్తామని OpenAI వెల్లడించింది.

AI అభివృద్ధి చెందుతున్న కొద్దీ.. ఇతర సమస్యలు తలెత్తుతున్న కొద్దీ.. శిక్షణను మళ్లీ నిలిపివేయాల్సి వస్తుందని కూడా OpenAI ముందే ప్రకటించింది. గత వారం ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్, ప్రభుత్వ జాతీయ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలోకి ఒక OpenAI ఏజెంట్ చొరబడిందని ఆస్ట్రేలియా వెల్లడించిన సంగతి తెలిసిందే. కానీ ఎలాంటి సున్నితమైన సమాచారం లీక్ కాకపోవడంతో ఆస్ట్రేలియా ప్రభుత్వ యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.
 
OpenAI ఏజెంట్లు సొంతంగా పనిచేయడం, వెబ్‌సైట్‌లను హ్యాక్ చేయడం, గోప్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని బహిర్గతం చేయడాన్ని నిరోధించేందుకు రక్షణ చర్యలు చేపట్టేందుకు వీలుగా, AI అభివృద్ధిని నెమ్మదింపజేయాలని ఏఐ ల్యాబ్‌లపై చట్టసభ సభ్యులు, సాంకేతిక నిపుణులు తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఓపెన్‌ఏఐ, ఆంత్రోపిక్ అధిపతులు కూడా ఏఐ అభివృద్ధిని నెమ్మదింపజేయాలని పిలుపునిచ్చారు.

మూడు నెలల్లో OpenAI తన మోడళ్ల అభివృద్ధిని నిలిపివేయడం ఇది రెండోసారి. AI స్టార్టప్ అయిన హగ్గింగ్ ఫేస్‌ను లక్ష్యంగా చేసుకున్న సైబర్ దాడి వెలుగులోకి వచ్చిన తర్వాత జూలైలో మొదటిసారి ఇలా జరిగింది. ఇప్పుడు అపఖ్యాతి పాలైన ఆ ఘటన, AI పరిశ్రమ ఏజెంట్లపై నియంత్రణ కోల్పోతోందనే భయాలను రేకెత్తించింది.

©️ VIL Media Pvt Ltd.