Reading Time: < 1 minute
భక్తులతో కిక్కిరిసిన ఖైరతాబాద్‌.. ఇంకా ప్రారంభంకాని బడా గణేష్‌ శోభాయాత్ర!

హైదరాబాద్‌లో మహా గణపతుల నిమజ్జనం ఈసారి ఆలస్యమవుతోంది. ఖైరతాబాద్‌, బాలాపూర్‌ గణనాథుల శోభాయాత్రలు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. క్రేన్‌లు, హైడ్రాలిక్‌ వ్యవస్థల్లో తలెత్తిన సమస్యల కారణంగా నిమజ్జన ప్రక్రియ ఆలస్యమైనట్లు తెలుస్తోంది. బాలాపూర్‌ గణేష్‌ ఇంకా ట్రక్‌పైకి ఎక్కలేదు. మరో గంటలో శోభాయాత్ర ప్రారంభిస్తామని ఉత్సవ కమిటీ సభ్యులు చెబుతున్నారు.

ఖైరతాబాద్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మహాగణపతిని నిమజ్జనానికి తరలించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నప్పటికీ.. ఇప్పటికీ క్రేన్‌పైకి ఎక్కించలేదు. దీంతో గతేడాదితో పోలిస్తే ఈసారి నిమజ్జనం ఆలస్యమవుతోంది. మరోవైపు ఖైరతాబాద్‌ పరిసర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. గణనాథుడి దర్శనం కోసం భారీగా భక్తులు తరలివచ్చారు.

మధ్యాహ్నం 2 గంటలలోపు మహాగణపతుల నిమజ్జనం పూర్తి చేస్తామని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ సజ్జనార్‌ ముందుగా తెలిపారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. శోభాయాత్రలు ఇంకా ప్రారంభం కాకపోవడంతో నిమజ్జనం ఎప్పటికి పూర్తవుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. భారీగా తరలివచ్చిన భక్తుల రద్దీ, ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని పోలీసులు భద్రతా ఏర్పాట్లను కొనసాగిస్తున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..