Reading Time: < 1 minute
Ap Local Body Elections 2026 Election Preparations Underway Hc Verdict Awaited

AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (APSEC) సిద్ధమవుతోంది. మిగిలిన 41 పట్టణ స్థానిక సంస్థల్లో డీలిమిటేషన్, ఓటర్ల జాబితాల ప్రక్రియను పూర్తి చేసే దిశగా అధికారులు ముందుకు సాగుతున్నారు. 41 యూఎల్‌బీలకు సంబంధించిన వార్డు వారీ ఓటర్ల జాబితాల ప్రక్రియ ఇప్పటికే చేపట్టారు.

అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. రిజర్వేషన్లు, ఓటర్ల జాబితాలకు సంబంధించిన అంశాలపై ఏపీ హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ పూర్తై తీర్పు రిజర్వ్ అయింది. తీర్పు వెలువడిన తర్వాత ఎన్నికల ప్రక్రియపై తదుపరి నిర్ణయాలు తీసుకోనున్నారు అధికారులు.

మరోవైపు ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ బాక్సులను మున్సిపల్, పంచాయతీరాజ్ అధికారులు ఇప్పటికే సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే అదనపు బ్యాలెట్ బాక్సులను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి కూడా తీసుకునే ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మున్సిపల్ ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. మున్సిపల్ ఎన్నికల అనంతరం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. పంచాయతీ ఎన్నికలను కూడా రెండు విడతల్లో నిర్వహించేందుకు ఎస్ఈసీ ఏర్పాట్లు చేస్తోంది.

ప్రస్తుతం డీలిమిటేషన్, ఓటర్ల జాబితాలు, రిజర్వేషన్ల ప్రక్రియలపై దృష్టి సారించిన అధికారులు.. హైకోర్టు తీర్పు తర్వాత ఎన్నికల నిర్వహణకు సంబంధించిన తదుపరి చర్యలను వేగవంతం చేయనున్నారు.