
డీజిల్ వాహనదారులకు.. ముఖ్యంగా భారీ వాహనాలు నడిపే వారికి ఒక ముఖ్యమైన గమనిక. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో.. ప్రైవేట్ ఇంధన రిటైలర్లు డీజిల్ అమ్మకాలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని ప్రైవేట్ పెట్రోల్ బంకుల్లో డీజిల్ విక్రయాలపై రోజువారీ లిమిట్స్ విధిస్తూ కొత్త రూల్స్ అమల్లోకి తెచ్చాయి.
ముఖేష్ అంబానీకి చెందిన ప్రముఖ ప్రైవేట్ ఇంధన సంస్థ జియో-బీపీ తమ బంకుల్లో డీజిల్ అమ్మకాల కోటాపై కోత విధించింది. చాలా అవుట్‌లెట్లలో ఒక్కో కస్టమర్‌కు కేవలం 50 లీటర్ల డీజిల్ మాత్రమే అందించాలని నిర్ణయించాయి. అంతేకాకుండా ఒక రోజులో విక్రయించే మొత్తం డీజిల్ పరిమితిని 6వేల లీటర్లకు పరిమితం చేశారు. గతంలో ఈ బంకుల్లో రోజువారీ సరాసరి అమ్మకాలు 11వేల లీటర్లుగా ఉండేవి. ఇదే బాటలో మరో ప్రైవేట్ ఆయిల్ సంస్థ నయారా ఎనర్జీ కూడా తమ బంకుల్లో డీజిల్ పరిమితిని 70 నుంచి 200 లీటర్ల మధ్య కట్టడి చేసింది.
అయితే ప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియన్ ఆయిల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ వంటి కంపెనీలు మాత్రం తమ పెట్రోల్ బంకుల్లో ఎలాంటి ఆంక్షలు లేవని వెల్లడించాయి. దేశంలోని లక్షలాది ఫ్యూయల్ స్టేషన్లలో సుమారు 90 శాతం ప్రభుత్వ రంగ సంస్థల ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. అందువల్ల సాధారణ వినియోగదారులపై దీని ప్రభావం చాలా తక్కువగా ఉండనుంది.
ALSO READ : స్టాక్ మార్కెట్లలో బేర్స్ విధ్వంసం
సుదూర ప్రాంతాలకు సరుకు రవాణా చేసే లారీలు, ట్రక్కుల వంటి కమర్షియల్ వాహనాల డ్రైవర్లకు ఇది కొంత ఇబ్బందికర పరిణామమే. హైవేలు, గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ బంకుల కంటే జియో-బీపీ, నయారా ఎనర్జీ బంకులే ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. ఈ ప్రైవేట్ బంకుల్లో డీజిల్ రేషనింగ్ ప్రారంభం కావడంతో లాంగ్ రూట్ వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మెుత్తానికి అంతర్జాతీయ ఉద్రిక్తతలు ప్రస్తుతం రవాణా రంగంపై కూడా ప్రభావం చూపే స్థాయికి పరిస్థితులు దిగజారటం ఆందోళన కలిగిస్తోందని నిపుణులు అంటున్నారు.