Reading Time: < 1 minute
Rohit Sharma 2027 Odi World Cup Work Not Done India

Rohit Sharma: ‘ఇంకా పని పూర్తి కాలేదు…’ అంటూ 2027 వన్డే ప్రపంచకప్‌పై టీమిండియా దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికే టెస్టులు, టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్, తన క్రికెట్ ప్రయాణం ఇంకా ముగిసిపోలేదని స్పష్టం చేశాడు. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో మిగిలిపోయిన అసంతృప్తిని, 2027 ప్రపంచకప్‌లో భారత్‌కు ట్రోఫీ అందించడం ద్వారా నెరవేర్చుకుంటారా అనేది ఇప్పుడు తీవ్ర ఆసక్తికరంగా మారింది. వెస్టిండీస్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు ముందు రోహిత్ శర్మ తన భవిష్యత్తు ప్రణాళికలపై మాట్లాడారు. జియోస్టార్‌తో జరిపిన సంభాషణలో.. క్రికెట్‌లో సాధించాల్సింది ఇంకా చాలా ఉందనే విషయాన్ని స్పష్టం చేశాడు. తన బాధ్యత లేదా పని పూర్తయిపోయిందనే ఆలోచన తన మనసులోకి ఎప్పటికీ రాదని రోహిత్ పేర్కొన్నాడు. మనం ఆట ఆడుతున్నంత కాలం సాధించడానికి ఏదో ఒక లక్ష్యం ముందు వరుసలోనే ఉంటుందని చెప్పాడు. 2027 వన్డే ప్రపంచకప్ కోసం తాను ఎంతగానో ఎదురుచూస్తున్నానని, ముందుకు సాగేందుకు ఈ టోర్నీనే తనకు ప్రధాన ప్రేరణ అని వెల్లడించాడు. అంతేకాకుండా సాధారణ సిరీస్‌లతో పోలిస్తే ఐసీసీ టోర్నీలు పూర్తి భిన్నమైన సవాళ్లను విసురుతాయని, వేర్వేరు జట్లు మరియు భిన్నమైన పరిస్థితులకు తగ్గట్లుగా మన ఆలోచనా విధానాన్ని, సన్నాహాలను మార్చుకోవాల్సి ఉంటుందని వివరించాడు.

ఇక, 2023 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా అద్భుతమైన ప్రదర్శనతో ఫైనల్ చేరినప్పటికీ, అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి ట్రోఫీకి అడుగు దూరంలో నిలిచిపోయింది. ఆ చేదు జ్ఞాపకాన్ని తుడిచేస్తూ 2027 వన్డే వరల్డ్ కప్‌లో భారత్‌ను విజేతగా నిలిపేందుకు రోహిత్ సిద్ధమవుతున్నాడు. ఈ టోర్నీ 2027 అక్టోబర్-నవంబర్ నెలల్లో సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాల్లో జరగనుంది. టెస్టులు, టీ20లకు గుడ్ బై చెప్పినప్పటికీ రోహిత్ ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో కొనసాగుతున్నాడు. మరోవైపు విరాట్ కోహ్లీ కూడా 2027 ప్రపంచకప్‌ తన చివరి వరల్డ్ కప్ కానుందని ఇప్పటికే సూచనలు ఇచ్చాడు. దీంతో మరోసారి రోహిత్-కోహ్లీల జోడీ భారత్ తరఫున వన్డేల అత్యున్నత వేదికపై సందడి చేయడం ఖాయంగా కనిపిస్తోంది.