Reading Time: 2 minutes
Sbi Waives Atm Charges During September 28 30 Bank Strike

Bank Strike: యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU).. బ్యాంకుల సమ్మెకు పిలుపునిచ్చింది.. దీంతో, నిత్యం బ్యాంకుల చుట్టూ తిరిగేవారు.. బ్యాంకు లావాదేవీలు చేసేవారిపై ఈ ప్రభావం పడనుంది.. ఏకంగా మూడు రోజుల పాటు బ్యాంకులు మూత పడనుండడంతో ఖాతాదారుల్లో ఆందోళన మొదలైంది.. ఈ సమయంలో.. తమ కస్టమర్లకు శుభవార్త చెప్పింది స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI).. సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు మూడు రోజుల దేశవ్యాప్త బ్యాంక్ సమ్మెకు UFBU పిలుపునిచ్చిన నేపథ్యంలో SBI కీలక నిర్ణయం తీసుకుంది. సమ్మె సమయంలో ఖాతాదారులకు ఇబ్బందులు తగ్గించేందుకు మూడు రోజుల పాటు ATM లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేయబోమని ప్రకటించింది. దేశంలోని ఏ బ్యాంకు ATMలోనైనా ఈ సమయంలో నగదు ఉపసంహరణకు ఈ సౌకర్యం వర్తిస్తుందని SBI తెలిపింది.

SBI తన అధికారిక సోషల్ మీడియా ప్రకటనలో.. సమ్మె సమయంలోనూ ATMలు, YONO, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, వాట్సాప్ బ్యాంకింగ్, 24×7 కాంటాక్ట్ సెంటర్ వంటి సేవల ద్వారా అవసరమైన బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. దీంతో బ్రాంచ్‌లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఖాతాదారులు పలు లావాదేవీలు చేసుకోవచ్చు.

UPI, NEFT, RTGS సేవలు అందుబాటులోనే
ఇక, సమ్మె సమయంలో SBI డిజిటల్ బ్యాంకింగ్ సేవలు కొనసాగించనున్నారు.. మొబైల్, ఇంటర్నెట్, వాట్సాప్ బ్యాంకింగ్‌తో పాటు UPI, IMPS, NEFT, RTGS ద్వారా నగదు బదిలీలు, చెల్లింపులు వంటి సాధారణ లావాదేవీలు చేసుకోవచ్చు. అయితే, బ్రాంచ్‌కు సంబంధించిన కొన్ని ప్రత్యక్ష సేవలు మాత్రం సమ్మె ప్రభావానికి గురయ్యే అవకాశం ఉంది. అందువల్ల అత్యవసరమైన బ్రాంచ్ లావాదేవీలను ముందుగానే పూర్తి చేసుకోవాలని తమ వినియోగదారులకు సూచిస్తున్నాయి బ్యాంకులు..

అసలు ఎందుకు ఈ సమ్మె..?
UFBU దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సిబ్బందిలో సుమారు 90 శాతం మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు పేర్కొంటోంది. ప్రధానంగా వారానికి ఐదు రోజులే బ్యాంకింగ్ పని దినాలుగా ఉండాలన్న డిమాండ్‌తో పాటు మరికొన్ని ఉద్యోగుల సమస్యలపై యూనియన్లు ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి. సెప్టెంబర్ 30న బ్యాంకుల అర్ధవార్షిక ముగింపు ఉండటంతో సమ్మె సమయం కీలకంగా మారింది.

సెప్టెంబర్ 27న ప్రభుత్వ బ్యాంకులు తెరిచే ఉంటాయి
మరోవైపు.. సమ్మెకు ముందు ఖాతాదారులకు అదనపు సేవా రోజును అందించేందుకు సెప్టెంబర్ 27 ఆదివారం రోజున ప్రభుత్వ రంగ బ్యాంకులు (PSBs), ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (RRBs) సాధారణంగా పనిచేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. RBI కూడా బ్యాంకు బ్రాంచ్‌లు, కార్యాలయాలు, ATM-లింక్‌డ్ బ్రాంచ్‌లు, కరెన్సీ చెస్ట్‌లు ఆ రోజు పనిచేయడానికి అనుమతి ఇచ్చింది. అందువల్ల సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు సమ్మె జరిగితే బ్రాంచ్‌లలో ప్రత్యక్ష సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ.. ATMలు, UPI, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సేవలను వినియోగించుకోవచ్చని బ్యాంకులు సూచిస్తున్నాయి. SBI తీసుకున్న ATM ఛార్జీల రద్దు నిర్ణయం ఈ మూడు రోజుల్లో నగదు అవసరమయ్యే ఖాతాదారులకు ఉపయోగపడనుంది.. ఇది SBI ఖాతాదారులకు ఎంతో ఊరట కల్పించే విషయంగానే చెప్పుకోవచ్చు..