Reading Time: < 1 minute
గర్భంతో ఉంది.. భారీ వర్షాలకు తట్టుకోలేక గ్రామంలోకి వచ్చిన చుక్కల జింక.. చివరకు..

ఏలూరు: వర్షాలు వరదలకు మనుషులే కాదు అడవిలో ఆవాసం ఏర్పాటు చేసుకునే జంతువులను సైతం ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని భారీ వర్షాల కారణంగా అటవీ ప్రాంతం నుండి జనావాసాల్లోకి వచ్చిన ఒక గర్భిణీ చుక్కల జింకను గ్రామస్థులు చాకచక్యంగా కాపాడారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యాదవోలు పరిధిలోని నిమ్మతోటల్లోకి అటవీ ప్రాంతం నుంచి దారితప్పి ఒక చుక్కల జింక ప్రవేశించింది. ఆ సమయంలో గ్రామంలోని వీధి కుక్కలు ఒక్కసారిగా జింకపై దాడికి దిగాయి. కుక్కల దాడిలో జింక తీవ్రంగా గాయపడింది. కుక్కల అరుపులు, జింక ఆర్తనాదాలు గమనించిన స్థానిక రైతులు, గ్రామస్థులు వెంటనే స్పందించి కుక్కలను తరిమివేశారు. అనంతరం గాయాలతో ఉన్న జింకను సురక్షితంగా పట్టుకున్నారు. ఆ జింక గర్భంతో ఉన్నట్లు గుర్తించిన స్థానికులు మరింత అప్రమత్తమై, మానవతా దృక్పథంతో దానికి ప్రాథమిక చికిత్స అందించారు.

గాయాలకు మందులు వేసి రక్షణ కల్పించారు. గ్రామస్థులు వెంటనే స్థానిక పోలీసులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని జింకను సంరక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం జింకను సురక్షిత ప్రదేశానికి లేదా సంరక్షణ కేంద్రానికి తరలించనున్నారు.

వీడియో చూడండి..

సకాలంలో స్పందించి ఒక మూగజీవాన్ని, దాని గర్భంలోని పిండాన్ని కాపాడిన యాదవోలు గ్రామస్థులను పలువురు అభినందిస్తున్నారు. గతం లో కొల్లేరు ప్రాంతంలోకి సైతం జింకలు వచ్చాయి. గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో దారి తప్పి తోటల్లోకి జింక వచ్చి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..