
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దేశం గర్వించదగ్గ నేత అని కొనియాడారు సీఎం రేవంత్ రెడ్డి. జాతి రత్నాన్ని స్మరించుకోవడం తెలంగాణ ప్రజల అదృష్టమని అన్నారు. మన్మోహన్ సింగ్ పాలనలో తీసుకున్న నిర్ణయాలు, ముఖ్యంగా ఆర్థిక సరళీకరణ విధానాలు దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపాయని చెప్పారు. 1991లో పీవీ నరసింహారావు కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ చేపట్టిన సంస్కరణలు దేశం ఆర్థికంగా ఎదగడంతో ఎంతో కీలకమైనవని సీఎం చెప్పారు.
హైదరాబాద్ గచ్చిబౌలిలోని విప్రో జంక్షన్ వద్ద మాజీ ప్రధాని, ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ కాంస్య విగ్రహాన్ని శనివారం(సెప్టెంబర్ 26) సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. మన్మోహన్ సింగ్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఐటీ కారిడార్‌లో ఏర్పాటు చేయడం ద్వారా మన్మోహన్ దేశ ఆర్థిక రంగానికి చేసిన సేవలను గుర్తుచేసుకుంటున్నామని చెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మన్మోహన్ సింగ్ పాలన, ఆలోచనలు జెన్‌జీతో పాటు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలవాలని అన్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు ఎడ్యుకేషన్, ఉపాధి హామీ, ఫారెస్ట్ రైట్స్, భూసేకరణ వంటి చట్టాలు, పథకాలు అమల్లోకి వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలోనూ అప్పటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను సీఎం గుర్తుచేశారు.
►ALSO READ | ఎల్నినో ముప్పు పొంచి ఉంది..తాగునీటిపై అప్రమత్తంగా ఉండాలి: మంత్రి సీతక్క
కార్యక్రమానికి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వీ. రమణతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మన్మోహన్ సింగ్ దార్శనికత, ఆర్థిక సంస్కరణలు, ప్రజా జీవితంలో ఆయన పాత్రను వారు స్మరించుకున్నారు.