
యాపిల్ పండ్లను కోసిన కొద్దిసేపటికే అవి నల్లగా లేదా గోధుమ రంగులోకి మారిపోవడం మనం తరచూ చూసే సమస్య. ఇలా జరగకుండా కోసిన యాపిల్ ముక్కలను ఎక్కువ సేపు తాజాగా, ఎర్రగా ఉంచడానికి కొన్ని సులువైన గృహ చిట్కాలు బాగా ఉపయోగపడతాయి. అవేంటంటే..
నిమ్మరసం లేదా నారింజ రసం-
యాపిల్ ముక్కలపై కొద్దిగా నిమ్మరసం లేదా నారింజ రసాన్ని చల్లడం లేదా నిమ్మరసం కలిపిన నీటిలో యాపిల్ ముక్కలను ముంచి తీయడం అత్యంత ప్రభావవంతమైన పద్ధతి. నిమ్మరసంలో ఉండే విటమిన్ సీ, సిట్రిక్ యాసిడ్ ఆక్సిడేషన్ ప్రక్రియను మందగించేలా చేసి, ముక్కలు రంగు మారకుండా కాపాడతాయి.
తేలికపాటి ఉప్పు నీటి చిట్కా-
ఒక కప్పు నీటిలో పావు టీస్పూన్ ఉప్పు కలిపి, అందులో కోసిన యాపిల్ ముక్కలను 3 నుండి 5 నిమిషాల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత వాటిని బయటకు తీసి మంచి నీటితో కడిగి ఆరబెట్టాలి. ఉప్పు గాలితో జరిగే చర్యను అడ్డుకుంటుంది. ఈ పద్ధతి వల్ల యాపిల్ రుచి దెబ్బతినకుండా రోజంతా తాజాగా ఉంటుంది.
తేనె నీరు-
ఒక కప్పు గోరువెచ్చని నీటిలో రెండు చెంచాల తేనె కలిపి, అందులో యాపిల్ ముక్కలను 2-3 నిమిషాలు ఉంచాలి. తేనెలో ఉండే సహజమైన కాంపౌండ్లు ఆక్సిడేషన్‌ను అడ్డుకుంటాయి. పైగా ఇది యాపిల్‌కు మంచి తీపి రుచిని, మెరుపును ఇస్తుంది.
సోడా లేదా కార్బోనేటెడ్ వాటర్-
లెమన్ సోడా లేదా క్లబ్ సోడా నీటిలో యాపిల్ ముక్కలను కొద్దిసేపు ముంచి తీయడం వల్ల కూడా అవి నల్లబడకుండా ఉంటాయి. సోడాలోని సిట్రిక్ యాసిడ్ రంగు మారకుండా నిరోధిస్తుంది.
ఎయిర్ టైట్ కంటైనర్, ఫ్రిజ్-
యాపిల్ ముక్కలను కోసిన వెంటనే గాలి చొరబడని డబ్బాలో ఉంచి లేదా ప్లాస్టిక్ ర్యాపర్ తో గాలి తగలకుండా చుట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి. గాలితో సంబంధం తగ్గడం వల్ల ముక్కలు ఎక్కువ సమయం తాజాగా ఉంటాయి.
ఈ చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే, మీరు కోసిన యాపిల్ ముక్కలు ఎప్పుడూ కాంతివంతంగా, కరకరలాడుతూ తాజాగా ఉంటాయి.