
AP New Excise Policy: ఆంధ్రప్రదేశ్‌లో మద్యం షాపుల కేటాయింపులో కొత్త విధానం అవలంభించనున్నట్టు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.. విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర ఎక్సైజ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన.. కొత్త ఎక్సైజ్ పాలసీ, మద్యం షాపుల రెన్యూవల్, కొత్తగా షాపుల కేటాయింపు, అక్రమ మద్యం విక్రయాల నియంత్రణ వంటి అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా కూడా పాల్గొన్నారు.
కొత్త పాలసీతో షాపుల కేటాయింపు
కొత్త ఎక్సైజ్ పాలసీకి కేబినెట్ ప్రతిపాదనలు సిద్ధం చేసిందని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. కొన్ని మద్యం షాపులను రెన్యూవల్ చేయగా, మిగిలిన షాపులకు టెండర్లు పిలిచినట్లు చెప్పారు. ఒక్కో షాపుకు నాలుగు కంటే తక్కువ దరఖాస్తులు వస్తే ప్రక్రియ రద్దయ్యే విధానం ఉంటుందని, అర్హత కలిగిన షాపులను కలెక్టర్ సమక్షంలో డ్రా పద్ధతిలో కేటాయిస్తామని వివరించారు. తాజా రాష్ట్ర విధానంలోనూ రెన్యూవల్ కాని షాపులకు డ్రా ఆఫ్ లాట్స్ ద్వారా కేటాయింపు, కనీసం నాలుగు దరఖాస్తుల నిబంధన ఉందని తెలిపారు.
2014-19లో మంచి పాలసీ చేశాం..
2014-19 మధ్య తమ ప్రభుత్వం మంచి ఎక్సైజ్ పాలసీని అమలు చేసిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. 2019-24 మధ్య ఏం జరిగిందో ప్రజలందరూ చూశారని వ్యాఖ్యానించారు. పాత మద్యం షాపుల లైసెన్స్‌ల కాలపరిమితి ముగియడంతో కొత్త పాలసీని తీసుకొచ్చామని తెలిపారు. ఇక, 3,562 షాపులకు టెండర్ల పిలవగా.. 2,929 షాపులకు రెన్యూవల్ పూర్తయిందని, మరో 804 షాపులను నోటిఫై చేస్తున్నామని చెప్పారు. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు దరఖాస్తులు స్వీకరించి, అనంతరం డ్రా పద్ధతిలో షాపులను కేటాయిస్తామని తెలిపారు. ఇక, కొత్త విధానంలో పర్మిట్ రూమ్స్‌కు అనుమతి ఇస్తున్నామని చెప్పారు. అయితే అనధికారికంగా నిర్వహించే షాపులకు ఎలాంటి అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేశారు. మద్యం షాపులన్నింటినీ ట్రాకింగ్ విధానంలోకి తీసుకువచ్చి పంపిణీ ప్రక్రియను పర్యవేక్షిస్తామని తెలిపారు.
సిండికేట్లకు చెక్.. టాప్ బ్రాండ్లకు అనుమతి
గతంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన ఆరోపణలను ప్రస్తావిస్తూ, మద్యం విక్రయాలపై సురక్ష యాప్ ద్వారా ట్రాకింగ్ చేయవచ్చని మంత్రి కొల్లు అన్నారు. గత పాలసీ మొత్తం అవినీతిమయంగా ఉండేదని ఆయన ఆరోపించారు. కొత్త విధానంలో సిండికేట్లు ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. టాప్ బ్రాండ్లకు మాత్రమే అనుమతి ఇస్తామని, ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వానికి ముఖ్యమని రవీంద్ర పేర్కొన్నారు. మద్యం షాపుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా ఉందని చెప్పారు. మొత్తంగా కొత్త ఎక్సైజ్ పాలసీ ద్వారా మద్యం షాపుల కేటాయింపులో పారదర్శకత, ట్రాకింగ్, అక్రమ విక్రయాల నియంత్రణకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. 2026-27 ఎక్సైజ్ విధానంలో రాష్ట్రవ్యాప్తంగా షాపుల రెన్యూవల్, రెన్యూవల్ కాని షాపులకు తాజా కేటాయింపు ప్రక్రియ కొనసాగుతోంది అన్నారు మంత్రి కొల్లు రవీంద్ర..