Reading Time: 2 minutes
Srikanth Odella Nani Clashes The Paradise Shooting

Srikanth Odela: షూటింగ్ సెట్స్‌లో హీరో, దర్శకుడి మధ్య విభేదాలు తలెత్తాయని వార్తలు వస్తే సాధారణంగా చిత్ర యూనిట్ వాటిని ఖండిస్తుంది లేదా దాటవేస్తుంది. కానీ ‘ది పారడైజ్’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మాత్రం ఎవరూ ఊహించని విధంగా ఓపెన్ అయ్యారు. నానితో గొడవలపై వచ్చిన పుకార్లను ఆయన ఏమాత్రం దాచకుండా నేరుగా ఒప్పేసుకున్నారు. సినిమా వేదికపైనే మైక్ పట్టుకుని “అవును.. నాని అన్నకు నాకు గొడవలు అయ్యాయి!” అంటూ బాంబ్ పేల్చారు. సెట్స్‌లో జరిగిన రచ్చ గురించి శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ.. “ఫిల్మ్ మేకింగ్ సమయంలో నాని అన్నకు కోపం వచ్చింది, ఆయన అలిగారు, తిట్టారు, తన్నారు.. శ్రీకాంత్ కూడా అరిచాడు అని చాలా విన్నాను. అవును, దాంట్లో నాని అన్న నన్ను తిట్టిన మాట వాస్తవమే. నేను కూడా ఆయనతో కొన్ని మాటలు మాట్లాడిన మాట నిజమే. షూటింగ్‌లో మా ఇద్దరి మధ్య గొడవలు జరిగిన మాట ముమ్మాటికీ నిజం” అని కుండబద్దలు కొట్టారు. బయట వ్యక్తులు దీన్ని వివాదంగా చూసినా, అది తమ పనిలో భాగంగా జరిగిన ఘర్షణేనని ఆయన స్పష్టం చేశారు.

ఎన్ని గొడవలు, విభేదాలు వచ్చినా నానితో తనకున్న అనుబంధం చెక్కుచెదరదని శ్రీకాంత్ భావోద్వేగంగా చెప్పుకొచ్చారు. “మా రిలేషన్ కేవలం ‘దసరా’ లేదా ‘ది పారడైజ్’ లాంటి సినిమాల మీటర్‌లో ఇమిడేది కాదు. వేరే హీరోలతోనో, వేరే దర్శకులతోనో నాని అన్న ఎలా ఉంటారో నాకు అనవసరం. కానీ మా ఇద్దరి ఎమోషన్ మాత్రం ప్రాజెక్టులతో ఆగిపోయేది కాదు. నాని అన్న నన్ను కచ్చితంగా భరించాలి.. ఆయనకు వేరే ఆప్షన్ లేదు. నన్ను ఆయన మోయాల్సిందే! ఎందుకంటే నన్ను ఇండస్ట్రీకి తీసుకొచ్చి నిలబెట్టింది ఆయనే. అలా తీసుకొచ్చినప్పుడు నా బాధ్యత కూడా ఆయనదే అవుతుంది. ఆయన నన్ను మోస్తారు కూడా. మా మధ్య తిట్లు ఉంటాయి, దెబ్బలాటలు ఉంటాయి, ప్రేమ ఉంటుంది. కొన్ని బంధాలు బతుకును, చావును దాటి ఉంటాయి. అందులో నాని అన్నతో నాకున్న బంధం ఒకటి” అంటూ అత్యంత రా అండ్ ఇంటెన్స్‌గా రియాక్ట్ అయ్యారు. క్రియేటివ్ విభేదాల వల్ల ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగిన మాట వాస్తవమే అయినా, అది తమ మధ్య ఉన్న గాఢమైన స్నేహాన్ని ఏమాత్రం తగ్గించలేదని శ్రీకాంత్ ఓదెల తేల్చిచెప్పారు. ఆయన చేసిన ఈ బోల్డ్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.