
పోషకాల నిధి అయిన పాలకూర ఏ సీజన్‌లోనైనా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా శీతాకాలంలో ఉదయాన్నే ఖాళీ కడుపుతో పాలకూర జ్యూస్ తాగడం వల్ల శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి. ఇందులో విటమిన్ ఎ, సి, కె, ఇ లతో పాటు కాల్షియం, ఐరన్, ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వారానికి రెండుసార్లు ఈ జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి..? కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఎలాటో వివరంగా చూద్దాం..
ఇంట్లోనే పాలకూర జ్యూస్ తయారు చేసుకునే విధానం:
పాలకూర జ్యూస్ చేయడం చాలా సులభం. ముందుగా తాజా పాలకూర ఆకులను తీసుకుని నీటితో శుభ్రంగా కడగాలి. తర్వాత దానిని మిక్సర్ జార్‌లో వేసి, కొద్దిగా నీరు, నిమ్మరసం చేర్చి బాగా బ్లెండ్ చేయాలి. ఆ మిశ్రమాన్ని ఒక గ్లాసులోకి వడకట్టి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగాలి. రుచి కోసం కొద్దిగా నల్ల ఉప్పును కూడా కలుపుకోవచ్చు.
పాలకూర జ్యూస్ తాగడం వల్ల కలిగే 8 ముఖ్యమైన ప్రయోజనాలు:
బలమైన ఎముకలు: చలికాలంలో ఎముకల సమస్యలు ఎక్కువగా వేధిస్తుంటాయి. పాలకూరలోని కాల్షియం, విటమిన్ కె ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
రోగనిరోధక శక్తి పెరుగుదల: విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేసి, టాక్సిన్లను బయటకు పంపి ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది.
మెరిసే చర్మం, దృఢమైన జుట్టు: ఇందులో ఉండే విటమిన్ ఎ, సి, ఇ పోషకాలు చర్మాన్ని కాంతివంతంగా మార్చడంతో పాటు చర్మ, జుట్టు సమస్యలను నివారిస్తాయి.
కంటి ఆరోగ్యం: పాలకూరలో లుటీన్, విటమిన్ ఎ సమృద్ధిగా ఉంటాయి. ఇవి చూపును మెరుగుపరచడమే కాకుండా, కంటిశుక్లం వంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి.
షుగర్ లెవల్స్ నియంత్రణ: డయాబెటిస్ ఉన్నవారికి పాలకూర రసం ఎంతో మేలు చేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.
జీర్ణక్రియ మెరుగుదల: పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో పాలకూర జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుంది. జీర్ణవ్యవస్థను ఉత్తేజపరిచి మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
గుండె ఆరోగ్యం: ఇది రక్తపోటు (BP), కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది, తద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
క్యాన్సర్ నివారణ: పాలకూరలోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కణాలకు కలిగే నష్టాన్ని నివారించి, క్యాన్సర్ బారిన పడకుండా శరీరాన్ని రక్షిస్తాయి.
కాబట్టి, ఈ శీతాకాలంలో పాలకూర జ్యూస్‌ను మీ దినచర్యలో భాగం చేసుకుని పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందండి!