
వాషింగ్టన్: యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్ ప్రతిపాదించిన 7 రోజుల శాంతి ప్రణాళికను అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. దీంతో అమెరికాలో నవంబర్ 3న మిడ్ టర్మ్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇరాన్‌పై మళ్లీ యూఎస్ బలగాలు బాంబు దాడులు ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఏడు నెలలుగా సాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకుగాను ఖతార్ ద్వారా అమెరికాకు ఏడు రోజుల ప్రణాళికను పంపినట్టు శుక్రవారం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వెల్లడించారు.
‘‘ఇరాన్‌పై నేవీ బ్లాకేడ్‌ను అమెరికా ఎత్తివేయాలి. చమురుపై ఆంక్షలను సడలించాలి. లెబనాన్‌తోపాటు అన్ని చోట్లా కాల్పుల విరమణను పాటించాలి. ఈ షరతులను నెరవేరిస్తే హార్మూజ్‌ను తెరుస్తాం. చర్చలను కూడా ఏడు రోజుల్లో తిరిగి ప్రారంభిస్తాం” అని ఆయన పేర్కొన్నారు.
బెదిరింపులకు, ఒత్తిళ్లకు ఇరాన్ తలొగ్గబోదని, సార్వభౌమ హక్కులను వదులుకోబోదని ఆయన స్పష్టం చేశారు. అయితే, అరాఘ్చీ ప్రకటన చేసిన కొన్ని గంటల తర్వాత ఆయన ప్రతిపాదనను ట్రంప్ తిరస్కరించారని ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ ఓ కథనంలో వెల్లడించింది. ఇరాన్ తన డిమాండ్లను నెరవేరుస్తుందనే దానిపై ట్రంప్ సందేహం వ్యక్తం చేశారని.. నవంబర్‌లో ఇరాన్‌పై మళ్లీ దాడులు ప్రారంభం కావచ్చని తెలిపింది.