
కెమెరా ముందుకు కదిలింది.. ఖరీదైన విదేశీ డోర్లు తెరుచుకున్నాయి.. లోపలికి అడుగుపెడితే కళ్లు జిగేల్మనే ఇటాలియన్ మార్బుల్.. నడిస్తే పాదాలు మునిగిపోయే ఇంపోర్టెడ్ కార్పెట్లు.. నెత్తిన వేలాడే లక్షల విలువైన షాండ్లియర్లు.. కూర్చుంటే రాచరికపు అనుభూతినిచ్చే వెండి సోఫాలు.. ఇవీ రాష్ట్రంలోని చాలా మంది లీడర్ల విలాసవంతమైన భవంతులు. తమ లైఫ్ స్టైల్ జనానికి చూపించి మా నాయకుడు గ్రేట్ అనిపించుకుందామనుకున్న నేతలకు సీన్ రివర్స్ అయింది.
ఒకవైపు రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతల ఫాంహౌస్ లు, కేసీఆర్ కుటుంబ ఆస్తులపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా విరుచుకుపడి, కాంగ్రెస్ బృందాలు క్షేత్రస్థాయికి వెళ్లి నిలదీస్తున్న వేళ.. మరోవైపు అధికార, ప్రతిపక్షాల నేతలు యూట్యూబ్ కెమెరాలను ఇళ్లలోకి ఆహ్వానించి ఇచ్చిన ‘హోమ్ టూర్’ వీడియోలు నెట్టింట కలకలం రేపుతున్నాయి.తమ లైఫ్ స్టైల్ తో ‘ఇమేజ్’ పెంచుకుందామనుకుంటే.. ఆ వీడియోల్లో కనిపించిన వైభోగం చూసి నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. జనాలు ఒక్కో రూపాయి కూడబెట్టి చిన్న ఇల్లు కొనుక్కోవడానికి జీవితకాలం పడుతుంటే.. వీళ్లు ఇన్నేసి ఆస్తులు ఎలా కూడబెట్టారని ప్రశ్నిస్తున్నారు.
ఇల్లా.. ఊరా..
మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి ఇల్లును చూసి ‘అది ఇల్లా.. ఊరా?’ అని నెటిజన్లు నోరెళ్ల బెడుతున్నారు. ప్రత్యేకంగా రూపొందించిన జిమ్, హోమ్ థియేటర్, భారీ కాంపౌండ్ లోపల విస్తరించిన ల్యాండ్ స్కేప్ గార్డెనింగ్, అరుదైన మొక్కలు ఆయన ఇంట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మార్కెట్ రేట్ల ప్రకారం రూ.25 కోట్ల నుంచి రూ.35 కోట్ల పైమాటేనని నెటిజన్లు లెక్కలు వేస్తున్నారు. ఒకప్పుడు సాధారణ ప్రభుత్వ ఉద్యోగి అయిన సదరు నేతకు ఇంత పెద్ద ఇల్లు, ఆస్తులు ఎలా వచ్చాయని యూట్యూబ్ వేదికగానే నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో మంత్రి అయ్యాకే ఈ స్థాయిలో కూడబెట్టారంటూ విమర్శలు చేస్తున్నారు.
ప్రకృతి ఒడిలో రాచరికం
సిటీ శివారులో ఓ బీజేపీ ఎంపీకి చెందిన ఇంటిని చూపించిన వీడియోలు గతంలోనే వైరల్ అయ్యాయి. పచ్చని చెట్లు, ఎకరాల కొద్దీ స్థలం, పల్లెటూరి వాతావరణం ప్రతిబింబించేలా ఉన్నప్పటికీ, ఆ ప్రాంగణం విస్తీర్ణం, దాని మార్కెట్ విలువ చూస్తే కళ్లు చెదరాల్సిందే. ఆ ప్యాలెస్ విలువ కనీసం రూ.50 కోట్లు ఉంటుందని ఎక్స్ పర్ట్స్ అంచనా.
ఇంటి నిండా లగ్జరీ కార్లు..
సిటీకి చెందిన ఓ ఎమ్మెల్యే తన విలాసవంతమైన భవనంలో ఇచ్చిన ఇంటర్వ్యూలు ఆయన ఆస్తిపాస్తుల వైభవాన్ని చాటాయి. హైదరాబాద్ తూర్పు ప్రాంతంలో భారీ ప్రాంగణం, అందులో పార్క్ చేసి ఉన్న లగ్జరీ కార్ల శ్రేణి చూస్తే ఆయన రాజకీయ ప్రస్థానంలో ఎదిగిన తీరు స్పష్టమవుతుందని చెబుతున్నారు. ఈ ప్రాపర్టీ విలువ రూ.30 కోట్లకు తక్కువ ఉండదన్నది టాక్.