Reading Time: 2 minutes

దక్షిణాఫ్రికాలో కాల్పుల కలకలం : ఏకే-47 రైఫిళ్లతో ఒక్కసారిగా విరుచుకుపడ్డ దుండగులు.. 27 మంది మృతి..

Caption of Image.

దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్, కేప్ టౌన్ నగరాల సమీపంలో వీకెండ్లో జరిగిన రెండు వేర్వేరు కాల్పుల ఘటనలు తీవ్ర కలకలం సృష్టించాయి. ఈ ఘటనలో మొత్తం 27 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు.

 మొదట జోహన్నెస్‌బర్గ్‌ సమీపంలోని ‘వెడెలా’ టౌన్‌షిప్‌లో ఉన్న ఒక  బార్ లో శనివారం రాత్రి (సెప్టెంబర్ 26) సుమారు 9:30 గంటలకు ఈ దాడి జరిగింది. ఏకే-47 రైఫిళ్లు, పిస్టళ్లతో ఎనిమిది మంది దుండగులు  బార్ పై అకస్మాత్తుగా దాడి చేశారు. లోపల, బయట ఉన్నవారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.

 ఈ ఘటనలో 13 మంది పురుషులు, 4 మహిళలు సహా మొత్తం 17 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 15 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిపాలయ్యారు. దుండగులు కాల్పుల అనంతరం కొందరి సెల్ ఫోన్‌లను లాక్కుని, రెండు వాహనాల్లో పరారయ్యారు. అంతేకాదు, మరో రెండు వాహనాలకు నిప్పు పెట్టారు.

 కేప్ టౌన్ సమీపంలోని ‘ల్వాండ్లే’ టౌన్‌షిప్‌లో ఆదివారం తెల్లవారుజామున సుమారు 1 గంటకు ఈ ఘటన జరిగింది. వెడెలా ఘటన జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే, ల్వాండ్లేలోని ఒక స్టోర్   పై దుండగులు మళ్లీ కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది గాయపడ్డారు.

అసలు కారణాలు ఏమిటి?
ఈ రెండు దాడులకు అసలు కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ రెండు ఘటనలకు ఏమైనా లింక్ ఉందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని, నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు.

 

©️ VIL Media Pvt Ltd.