
IND vs AFG: 2026 ఆసియా క్రీడల (Asian Games 2026) పురుషుల క్రికెట్ టోర్నమెంట్‌లో నాకౌట్ పోరు మరింత రసవత్తరంగా మారింది. గ్రూప్ దశలో జరిగిన అనూహ్య పరిణామాలతో , క్వార్టర్ ఫైనల్స్‌లో అఫ్ఘానిస్థాన్ జట్టుతో టీమిండియా పోటీ పడేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 28వ తేదీన నిస్షిన్ వేదికగా ఈ హైవోల్టేజ్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
వర్షం దెబ్బ.. గ్రూప్-ఏ టాపర్‌గా నేపాల్:
జపాన్‌తో జరగాల్సిన కీలక మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా రద్దు కావడంతో నేపాల్ జట్టుకి ఊహించని ప్రయోజనం దక్కింది. ఈ ఫలితంతో నేపాల్ గ్రూప్-ఏ లో అగ్రస్థానంలో నిలవగా, అఫ్ఘానిస్థాన్ కూడా తదుపరి దశకు అర్హత సాధించింది. మరోవైపు టోర్నీ అంతటా కిరాక్ ప్రదర్శన కనబరిచిన జపాన్, ఈ వర్షం కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితి నెలకొంది.
నేపాల్ విధ్వంసం.. జూరా, బామ్ మెరుపులు:
వర్షం కారణంగా 15 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన నేపాల్ జట్టు నిర్ణీత 15 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 149 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఒక దశలో 84 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన నేపాల్‌ను సుందీప్ జూరా, లోకేష్ బామ్ జోడీనే ఆదుకుంది. ఇక నంబర్ 3 లో బరిలోకి దిగిన సుందీప్ 32 బంతుల్లోనే అజేయంగా 57 పరుగులు (5 ఫోర్లు, 3 సిక్సర్లు) బాదాడు. చివర్లో విరుచుకుపడిన లోకేష్ బామ్ కేవలం 22 బంతుల్లోనే 52* రన్స్ (6 సిక్సర్లు, 1 ఫోర్) చేసి సంచలనం సృష్టించాడు. ఆసిఫ్ షేక్ (21 పరుగులు) ఫర్వాలేదనిపించాడు.
వర్షం దెబ్బకి టోర్నీ నుంచి జపాన్ ఔట్:
నేపాల్ నిర్దేశించిన 150 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జపాన్ ఇన్నింగ్స్ ఒక్క బంతి కూడా పడకుండానే భారీ వర్షం కురిసింది. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను పూర్తిగా రద్దు చేయాల్సి వచ్చింది. టోర్నీ ఆరంభంలో అఫ్ఘానిస్థాన్‌తో అద్భుతంగా ఆడి, అంతకుముందు భారత్‌తో జరిగిన టీ20లోనూ గట్టి పోటీనిచ్చిన జపాన్.. చివరికి వర్షంతో దురదృష్టవశాత్తు టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
సెమీస్ లక్ష్యంగా భారత్ వర్సెస్ ఆఫ్ఘన్ పోరు:
గ్రూప్-ఏ సమీకరణాలు ఖరారు కావడంతో, సెప్టెంబర్ 28వ తేదీన జరగనున్న క్వార్టర్ ఫైనల్ పోరులో భారత్ వర్సెస్ ఆఫ్ఘానిస్థాన్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి సెమీఫైనల్‌లోకి ప్రవేశించాలని టీమిండియా పట్టుదలగా ఉంది.