Reading Time: 2 minutes
Arunachalam: అరుణాచల కొండకు ప్రకృతి చికిత్స.. ఫలిస్తుందా!

అగ్ని రూపంలో కొలువైన అరుణాచలేశ్వరుడు.ఇప్పుడా అరుణాచల కొండను కూల్ చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఇది అరుణాచలాన్ని కాపాడుకునేందుకు మొదలైన ప్రకృతి చికిత్స. భారీ వర్షం పడితే కొండ మీద నుంచి నీరు ఎటు వెళ్తోంది..? ఎక్కడ మట్టి పట్టు కోల్పోతోంది..? ఏ ప్రాంతంలో బండరాళ్లు జారిపోయే ప్రమాదం ఉంది..? ఏటా లక్షల మంది గిరిప్రదక్షిణ చేసే పవిత్ర కొండకు మళ్లీ 2024 నాటి ప్రమాదం రాకుండా అక్కడి ప్రభుత్వం ఏం చేయబోతోంది.? 2024 డిసెంబర్ ఒకటో తేదీన జరిగిన విషాదాన్ని తిరువణ్ణామలై ఇంకా మర్చిపోలేదు. ఫెంగల్ తుపాను తెచ్చిన కుండపోత వర్షాలకు అరుణాచల కొండపై ఉన్న మట్టి పట్టుకోల్పోయింది… భారీ బండరాళ్లు, మట్టి, శిథిలాలు ఒక్కసారిగా కిందున్న ఇళ్లపైకి దూసుకొచ్చాయి. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు… అందులో ఐదుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన తర్వాత నిపుణుల కమిటీ కొండను పరిశీలించింది. ఇప్పుడు మరోసారి అలాంటి విషాదం జరగకుండా గ్రీన్ తమిళనాడు మిషన్ చేపట్టింది. అసలు కొండచరియ ఎందుకు విరిగింది..? కేవలం ఒక్కరోజు భారీ వర్షమే కారణమా..? లేక కొండలో అంతకుముందే బలహీనమైన ప్రాంతాలున్నాయా..? ఇప్పుడు అధికారులు వెతుకుతున్న సమాధానం ఇదే. అరుణాచలంతో పాటు తిరువణ్ణామలై పరిసర కొండల్లో సరైన డ్రైనేజ్ లేకపోవడం, కార్చిచ్చులు, పూడుకుపోతున్న నీటి వనరులు కొండల సహజ స్వభావాన్ని దెబ్బతీస్తున్నట్లు గుర్తించారు. అందుకే మట్టి, రాళ్ల నమూనాలు సేకరిస్తున్నారు. డ్రోన్లు, శాటిలైట్ మ్యాపింగ్ సహాయంతో కొండ స్వరూపాన్ని పరిశీలిస్తున్నారు. వర్షం పడినప్పుడు నీరు ఏ దిశలో, ఎంత వేగంగా కిందకు వస్తోంది..? ఎక్కడ మట్టిని కోసేస్తోంది..? ఎక్కడ ఎక్కువ ప్రమాదం ఉందో మ్యాప్ చేస్తున్నారు. దీనికోసం దాదాపు 962 హెక్టార్ల ప్రాంతాన్ని 16 చిన్న వాటర్‌షెడ్లుగా విభజించారు. ఒక్కో ప్రాంతంలో నీటి ప్రవాహం ఎలా ఉందో విడివిడిగా అంచనా వేస్తున్నారు. ఎక్కడ నీటి వేగాన్ని తగ్గించాలి..? ఎక్కడ మట్టి కొట్టుకుపోకుండా అడ్డుకోవాలి..? ఎక్కడ మళ్లీ చెట్లు, స్థానిక వృక్షజాతులను పెంచాలి..? ఎక్కడ పూడిక తొలగించి నీటి ప్రవాహాన్ని సరిచేయాలి..? ఇలా ఒక్కో సమస్యకు ఒక్కో పరిష్కారం సిద్ధం చేస్తున్నారు. ఎందుకంటే భారీ వర్షం వచ్చినప్పుడు నీటిని పూర్తిగా ఆపలేం.కానీ ఆ నీరు కొండను కోసుకుంటూ ఒక్కసారిగా కిందకు దూసుకురాకుండా దాని వేగాన్ని తగ్గించొచ్చు… మట్టిని పట్టుకునే వృక్ష సంపదను తిరిగి పెంచొచ్చు. అదే ఈ ప్రాజెక్టు వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం. అందుకే ఇది కేవలం మొక్కలు నాటే గ్రీన్ మిషన్ కాదు. ఒక పవిత్ర కొండకు చేస్తున్న ఎకోలాజికల్ రిపైర్. అరుణాచలం అంటే ఏదోసాధారణకొండ కాదు. పంచభూత క్షేత్రాల్లో అగ్నికి ప్రతీకగా భావించే క్షేత్రం. పౌర్ణమి వస్తే లక్షల మంది భక్తులు దాదాపు 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణ చేస్తారు. అలాంటి కొండకు ఒకవైపు భక్తుల రద్దీ… మరోవైపు మారుతున్న వాతావరణం, భారీ వర్షాలు, మట్టి కోత లాంటి సవాళ్లు ఎదురవుతున్నాయి. అందుకే 2024లో జరిగిన విషాదం మరోసారి జరగకుండా తమిళనాడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రీన్ మిషన్‌ చేపట్టింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

BIS: ఇకపై స్క్రీన్ గార్డులకు BIS తప్పనిసరి

PhonePe: ఫోన్‌పే భారీ విస్తరణ.. 20,000 ఉద్యోగాలు

Vijayawada: ఏపీలో భారీ వర్షాలు ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన వరద