
నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌లో తీవ్ర అస్వస్థతకు గురైన ఓ ప్రయాణికుడి పరిస్థితి చూసేవారిని కలచివేస్తోంది. హైదరాబాద్ నుంచి నెల్లూరుకు వెళ్తుండగా వెంకటేష్(41) అనే ప్యాసింజర్ అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యాడు. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు చైన్ లాగి రైలును నిలిపి చిట్యాల రైల్వే స్టేషన్‌లో దిగారు.
అయితే ప్రాణాపాయంలో ఉన్న వెంకటేష్‌కు వెంటనే వైద్యం అందాల్సిన సమయంలో.. రైలు సిబ్బంది అతడిని ప్లాట్‌ఫామ్‌పైనే వదిలి వెళ్లిపోయారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రాణం కోసం వెంకటేష్ పోరాడుతుండగా.. సహాయం కోసం కుటుంబ సభ్యులు ఆందోళనగా ఎదురుచూడాల్సి వచ్చింది.
108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చినా గంట గడిచిపోయినా స్పందన లేదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. దీంతో స్థానికుల సాయంతో కుటుంబ సభ్యులే వెంకటేష్‌కు సీపీఆర్ చేశారు. ఆటోలో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
►ALSO READ | మెదక్ జిల్లాలో గ్యాస్ గోదాంలపై దాడులు..296 అక్రమ సిలిండర్లు సీజ్
ఓ వైపు ప్లాట్‌ఫామ్‌పై చావుబతుకుల మధ్య వెంకటేష్ కొట్టుమిట్టాడుతుండగా.. సాయం కోసం కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు అక్కడున్న వారిని కలచివేశాయి. అత్యవసర సమయంలో సకాలంలో వైద్యం అందితే పరిస్థితి మెరుగుపడేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.