Reading Time: < 1 minute
Revanth Reddy Gandhi Parivar Sangh Parivar Kerala Speech

దేశంలో ప్రస్తుతం ‘సంఘ్ పరివార్’, ‘గాంధీ పరివార్’ అనే రెండు సిద్ధాంతాల (పరివార్‌ల) నడుమ తీవ్రమైన పోరాటం జరుగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేరళలోని నిలంబూర్‌లో నిర్వహించిన ‘ఆర్యదాన్ ముహమ్మద్ – 2026’ బెస్ట్ పబ్లిక్ సర్వెంట్ పురస్కార ప్రదానోత్సవంలో పాల్గొన్న ఆయన, ఈ సందర్భంగా సంఘ్ పరివార్ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మతం, భాష, సంస్కృతి, కులం పేరిట సంఘ్ పరివార్ దేశాన్ని అన్ని విధాలుగా విడగొడుతోందని ధ్వజమెత్తారు. సంఘ్ పరివార్ ధోరణి ఈ దేశానికి, ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యంత పెద్ద ప్రమాదకారిగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.

దేశం కోసం ప్రాణాలర్పించిన చరిత్ర గాంధీ పరివార్‌ది

సంఘ్ పరివార్ విభజన రాజకీయాలు చేస్తుంటే, మరోవైపు గాంధీ పరివార్ దేశ సమగ్రత కోసం సమస్తాన్ని త్యాగం చేసిందని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. దేశ రక్షణ , సమైక్యత కోసం మహాత్మా గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు తమ ప్రాణాలను సైతం బలిదానం చేశారని గుర్తుచేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు కేంద్ర మంత్రి, ప్రధాన మంత్రి, రాష్ట్రపతి వంటి అత్యున్నత పదవులను త్యాగం చేసి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతున్నారని ప్రశంసించారు. దేశాన్ని ముక్కలు చేస్తున్న సంఘ్ పరివార్‌ను చిత్తుగా ఓడించాలంటే భారతదేశమంతా గాంధీ పరివార్‌కు కొండంత అండగా నిలవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.

గాంధీ పరివార్ కోసం నా ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధం

దేశాన్ని సంఘ్ పరివార్ బారి నుంచి రక్షించుకోవడానికి, గాంధీ పరివార్ ఆశయాల కోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి తాను సర్వదా సిద్ధంగా ఉన్నానని సీఎం రేవంత్ రెడ్డి ఉద్వేగభరితంగా ప్రకటన చేశారు. ఈ సిద్ధాంత యుద్ధంలో సంఘ్ పరివార్‌ను ఓడించి ముందంజలో నిలవడంలో కేరళ ఇప్పటికే దేశానికి ఒక స్పష్టమైన సంకేతాన్ని, మార్గదర్శకత్వాన్ని ఇచ్చిందని కొనియాడారు. లౌకిక విలువలు, ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా సాగే ఈ పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.