
ఎన్నికల కమిషన్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై అంతర్గత విభేదాలు ఉన్నాయన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. విపక్ష పార్టీలన్నీ సీఈసీ రాజీనామాకు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తుండగా.. అధికార ఎన్డీఏ పక్షం నుంచి కూడా కొన్ని పార్టీలు స్పందిస్తున్నాయి. ఆరోపణలపై సీఈసీ జ్ఞానేష్ కుమార్ ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిందిగా కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ సీఈసీ జ్ఞానేష్ కుమార్ ను కోరారు.
పాట్నాలో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ పై వస్తున్న ఆరోపణలకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రధానంగా సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై ఉందని అన్నారు. ప్రతిపక్షాలకు సమాధానం ఇవ్వడం కోసం కాదని.. ఓటర్లలో సందేహాలు తలెత్తకుండా, ఎన్నికల వ్యవస్థపై విశ్వాసం కొనసాగేలా ప్రజలకు నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రజలు ఎన్నికల ప్రక్రియపై నమ్మకం కోల్పోయినా.. సందేహాలు పెంచుకున్నా అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. కాబట్టి ఎన్నికల కమిషన్ తన వైఖరిని మరింత బలంగా వ్యక్తం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఎన్‌డీఏ మరో మిత్రపక్షం రాష్ట్రీయ లోక్ మోర్చా అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహా కూడా ఓటర్లలో గందరగోళం తొలగించేందుకు ఎన్నికల కమిషన్ వెంటనే స్పందించాలని ఎక్స్ లో పోస్ట్ చేశారు.
ఏంటి వివాదం ?
సర్ ప్రక్రియపై ఎన్నికల కమిషనర్ల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్టులో పేర్కొనటంతో వివాదం మొదలైంది. ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి గత 10 నెలల్లో SIR ప్రక్రియపై 14 సార్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారని నివేదిక వెల్లడించింది. కొత్త ఓటర్ల నమోదు, పేర్ల తొలగింపు, సాఫ్ట్‌వేర్ యాక్సెస్ వంటి అంశాలపై అభ్యంతరాలు తెలిపినట్లు రిపోర్టు లో పేర్కొన్నారు.
దీంతో ప్రతిపక్షాలు ఎన్నికల కమిషన్‌పై దాడి దిగుతున్నాయి. ఓటర్ల హక్కులను రక్షించడంలో ఎన్నికల సంఘం విఫలమైందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆరెస్సెస్, బీజేపీ, ఎన్నికల సంఘం ఉమ్మడిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయని విమర్శించారు.
ఎన్నికల కమిషన్ లో అంతర్గత చర్చలు సహజమని, అన్ని నిర్ణయాలు ఏకగ్రీవంగా తీసుకున్నామని ఈసీ స్పష్టం చేసింది. SIR ప్రక్రియలో బీహార్‌లో ప్రారంభమై ఇతర రాష్ట్రాలకు విస్తరించి, డ్రాఫ్ట్ జాబితాల నుంచి 13 కోట్లకు పైగా పేర్లు తొలగించినట్లు నివేదికలు చెబుతున్నాయి.