
కోలీవుడ్ దళపతి, తమిళనాడు సీఎం విజయ్ వారసుడు జేసన్ సంజయ్ తన తొలి అడుగులోనే సరికొత్త సంచలనానికి తెరలేపారు. ఆయన దర్శకత్వంలో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో సందీప్ కిషన్, టాలీవుడ్ ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన యాక్షన్ అడ్వెంచర్ అండ్ ట్రెజర్ హంట్ మూవీ ‘సిగ్మా’. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన ఈ ద్విభాషా చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్వీఆర్ సినిమా కలిసి అక్టోబర్ 2న భారీ అంచనాల మధ్య విడుదల చేస్తున్నాయి.
హైదరాబాద్‌లో శుక్రవారం ( సెప్టెంబర్ 25, 2026) రాత్రి జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. వేదికపై చిరూ మాట్లాడుతూ.. కంటెంట్ బాగుంటే మన తెలుగు ప్రేక్షకులు ఏ భాషా చిత్రానైనా గుండెల్లో పెట్టుకుంటారు అని అన్నారు. ఎవరి మాటా వినని వాడ్ని సిగ్మా అంటారు అనే కాన్సెప్ట్ నాకు బాగా నచ్చిందని చెప్పారు..
జేసన్ సంజయ్ తాతగారు ఎస్.ఎ.చంద్రశేఖర్‌తో కలిసి తాను’చట్టానికి కళ్ళులేవు’, ‘దేవాంతకుడు’ లాంటి బ్లాక్‌బస్టర్స్ చేసినట్లు మెగాస్టార్ గుర్తుచేశారు. సంజయ్ తన తాత, నాన్నల జీన్స్ పుణికిపుచ్చుకున్నాడు. ఆయన నటన కాకుండా డైరెక్షన్‌ను ఎంచుకోవడం ఆయనలోని సృజనాత్మకతకు నిదర్శనం. సందీప్ కిషన్ నాకు సొంత కుటుంబసభ్యుడి లాంటివాడు. కొత్త రక్తం వస్తేనే పరిశ్రమకు అసలైన ఎనర్జీ వస్తుంది అని ఆశీర్వదించారు.
గోల్డెన్ స్పూన్‌తో పుట్టినా, స్వయంకృషినే నమ్ముకుని కేవలం 70 రోజుల్లో ఈ వండర్‌ను సంజయ్ తెరకెక్కించాడని హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ కొనియాడారు. ఈ కథ ముందుగా దుల్కర్ సల్మాన్ దగ్గరకు వెళ్లినా, చివరికి నా దగ్గరకు రావడం నా అదృష్టం అన్నారు. ఈ మూవీ తప్పక ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
అనంతరం జేసన్ సంజయ్ మాట్లాడుతూ.. నన్ను, నా విజన్‌ను నమ్మి సపోర్ట్ చేసిన సందీప్ కి థ్యాంక్స్ చెప్పారు. ప్రతి ఒక్కరినీ మెప్పించే యాక్షన్ అడ్వెంచర్ ఇదిఅని చెప్పారు. ఈవెంట్‌లో ఫరియా అబ్దుల్లా, తమన్, ఛోటా కె. నాయుడు , ప్రముఖ నిర్మాతలు పాల్గొని సినిమా ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించారు. ఇక థియేటర్లలో ఈ ‘సిగ్మా’ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.