Reading Time: 4 minutes

ఢిల్లీ సాఫ్ట్ వేర్ ఎఫెక్ట్ గల్లీ ఓట్లు ఆగం..కొంపముంచిన ఈఆర్వో నెట్ సాఫ్ట్వేర్

Caption of Image.
  • రాష్ట్రంలో 92 లక్షల మందికి సర్ నోటీసులు
  • స్పెల్లింగ్ మిస్టేక్, ఏజ్ తప్పు ఉంటే జారీ
  • 30 లక్షల మంది ఓటర్లది ఇదే సమస్య 
  • నమోదు సమయంలో సరిచేసే అవకాశం 
  • లేకపోవడమే సమస్యకు ప్రధాన కారణం
  • అర్హత రుజువు చేసుకునేందుకు జనం తిప్పలు
  • ఆధారాలతో అధికారుల వద్దకు పరుగులు
  • ఒకప్పుడు ఈఆర్వోలు, బీఎల్వోలకు పవర్స్
  • ఢిల్లీ నుంచి సెంట్రలైజ్డ్ సిస్టంతో పరేషాన్

హైదరాబాద్​, వెలుగు: స్పెషల్​ ఇంటెన్సివ్​ రివిజన్​ (సర్) ప్రక్రియలో భాగంగా ఎన్నికల సంఘం  ‘ఈఆర్వో నెట్’ సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌లో చేసిన మార్పులే  రాష్ట్ర ఓటర్ల పాలిట శాపంగా మారాయి. అక్షర దోషాలు, తండ్రీ, కొడుకుల వయస్సుల్లో తేడా, పేరులో తప్పులకు కూడా నోటీసులు అందుతున్నాయి. ఢిల్లీ నుంచి సెంట్రలైజ్డ్ ​సిస్టమ్​తో అన్ని అర్హతలున్నా లక్షలాది మందికి ఓటుహక్కు కోసం తిప్పలు తప్పడం లేదు. రాష్ట్రంలో​ ఏకంగా 92 లక్షల మంది ఓటర్లకు ‘సర్‌‌‌‌‌‌‌‌’ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి వీరిలో దాదాపు 30 లక్షల మంది ఓటర్లకు నోటీసులు ఇచ్చేంత పెద్ద సమస్య లేదు. ఎందుకంటే వారి పేర్లలో చిన్నచిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్, పుట్టిన తేదీల్లో స్వల్ప తేడాలు, ఇంటి పేరు అటుఇటు కావడంలాంటి చిన్నచిన్న పొరపాట్లే ఉన్నాయి.  బీఎల్వోలు ఓటర్ల వివరాలు నమోదు చేసేటప్పుడే వీటిని సరిచేసే వెసులుబాటు సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌లో లేకపోవడమే సమస్యగా మారింది. పైగా  బీఎల్వో యాప్‌‌‌‌లో పొరపాట్లకు సంబంధించి ఎలాంటి అలర్ట్ ఇవ్వకుండా ఇచ్చిన వివరాలను తీసుకోవడంతో ఎంట్రీ దశలోనే  చిన్నచిన్న తప్పులు దొర్లాయి. సాధారణంగా ‘సర్’​ ప్రక్రియలో భాగంగా పంపిణీ చేసిన ఫారాలను బీఎల్వోలు యాప్‌‌‌‌లో  నమోదు చేస్తున్నప్పుడు అన్నీ సరిగ్గా ఉంటే ‘మ్యాచ్డ్’​ అని వస్తుంది. ఏమైనా పొరపాట్లు జరిగితే ఎలాంటి అలర్ట్​ రాలేదు. పైగా ఇచ్చిన వివరాలను యథావిధిగా తీసుకున్నది. దరఖాస్తు నమోదు దశలో పొరపాట్లు దొర్లినప్పుడు, వాటిని అక్కడికక్కడే సరిచేసే వెసులుబాటు లేకుండా పోయింది. 

మొత్తం వ్యవస్థను ఢిల్లీ కేంద్రంగా సెంట్రలైజ్ చేయ డంతో స్థానిక బీఎల్వోలు, ఈఆర్వోలు, ఇతర ఎన్నికల అధికారులు  చేతులెత్తేశారు. ఈ పరిస్థితి కారణంగా కొన్ని దశాబ్దాలుగా ఓటేస్తున్న సాధారణ పౌరులు కూడా ఇప్పుడు అనుమానితుల జాబితాలోకి చేరారు. తాము ఈ దేశ పౌరులమేనని, తాము నిజమైన​ ఓటర్లమేనని  నిరూపించుకోవడానికి అవస్థలు పడుతున్నారు. ఒకవేళ ఈఆర్వో నెట్​ సరిగ్గా ఉండి ఉంటే 92 లక్షలకు బదులు నోటీసులు అందుకునే ఓటర్లు 60 లక్షలకే పరిమితం అయ్యేవారని, అందులోనూ మ్యాపింగ్​కాని వారిని తొలగిస్తే ఈ సంఖ్య ఇంకా తగ్గేదని సెక్రటరియేట్​వర్గాలు చెప్తున్నాయి.

ఒకప్పుడు ఈజీ.. ఇప్పుడంతా ఢిల్లీ..

గతంలో ఈఆర్వో నెట్ పనిచేసిన తీరుకు, ప్రస్తుత పనితీరుకు నక్కకు, నాకలోకానికి ఉన్నంత వ్యత్యాసం కనిపిస్తోందని ఎక్స్‌‌పర్ట్స్​ చెప్తున్నారు. మొదట్లో ఈఆర్వో నెట్ వ్యవస్థలో క్షేత్రస్థాయి బీఎల్వోలు, డివిజనల్ స్థాయి ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లకు (ఈఆర్వో) విస్తృతమైన అధికారాలు, పరిశీలన వెసులుబాట్లు ఉండేవి. ఓటరు దరఖాస్తులో చిన్న చిన్న అక్షరదోషాలున్నా, ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డుతో, ఇతర  సర్టిఫికెట్లతో సరిపోలకపోయినా క్షేత్రస్థాయిలోనే వాస్తవాలను పరిశీలించి (లోకల్ వాలిడేషన్) వెంటనే సరిదిద్దే అధికారం స్థానిక అధికారులకు ఉండేది. ఓటరు నిజంగా సదరు గ్రామంలో, ఇంట్లో నివసిస్తున్నాడని రూఢీ చేసుకొని  సమస్యను అక్కడికక్కడే పరిష్కరించేవారు. కానీ, ఇటీవల తీసుకొచ్చిన కేంద్రీకృత మార్పుల పుణ్యమా అని స్థానిక అధికారుల చేతులను ఎన్నికల సంఘం పూర్తిగా కట్టేసింది. ఢిల్లీ సర్వర్లలోని అల్గారిథమ్‌‌లే ఓటరు అర్హతను నిర్ణయించే స్థాయికి వ్యవస్థను మార్చడంతో మాన్యువల్‌‌ పరిశీలనకు అవకాశమే లేకుండా పోయింది. క్షేత్రస్థాయిలో ఓటరు ప్రత్యక్షంగా కనిపిస్తున్నప్పటికీ సిస్టమ్ అనుమానాస్పదంగా ఫ్లాగ్ చేసిన వివరాలను సవరించే అధికారం రెవెన్యూ యంత్రాంగానికి లేదు.  గతంలో బీఎల్వోలు తమ మొబైల్ యాప్‌‌లో కొత్త ఓటర్ల వివరాలను నమోదు చేస్తున్నప్పుడు.. పేరు లేదా పుట్టిన తేదీ కేంద్ర సర్వర్ రికార్డులతో సరిపోలకపోతే వెంటనే స్క్రీన్‌‌పై ‘పాప్-అప్ అలర్ట్’ వచ్చేది. దాంతో డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఆ క్షణంలోనే తప్పును సరిచూసుకొని, సరైన వివరాలను అప్‌‌లోడ్ చేసేవారు. కానీ, కొత్తగా తీసుకొచ్చిన యాప్ అప్‌‌డేట్‌‌లో ఈ రియల్-టైమ్ అలర్ట్ ఫీచర్‌‌ను అకారణంగా తీసివేయడంతో అసలు తిప్పలు మొదలయ్యాయి. టైపింగ్ సమయంలో దొర్లే చిన్న చిన్న దోషాలు ఎలాంటి హెచ్చరికలు లేకుండానే సర్వర్‌‌లోకి వెళ్లిపోతున్నాయి. అలా అప్‌‌లోడ్ అయిన డేటాను సెంట్రల్ అల్గారిథమ్ వెంటనే ఏఐతో  ‘అన్​ మ్యాప్డ్​’ కేటగిరీ కింద జమకట్టి ఆటోమేటిక్‌‌గా నోటీసులు జారీ చేసింది. ఇదే తీవ్ర గందరగోళానికి దారితీసిందనే చర్చ అధికార వర్గాల్లో నడుస్తున్నది. 

ఓటుహక్కు నిరూపించుకునేందుకు తిప్పలు.. 

ఎన్నికల విభాగం పంపిన నోటీసులు చేతికందగానే ఎక్కడ తమ ఓటు హక్కు గల్లంతవుతుందోనన్న ఆందోళనతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.  60, 70 ఏండ్లుగా అదే ఊరిలో పుట్టి పెరిగి, ఎన్నో ఏండ్లుగా ఓటేస్తున్న పండుటాకులకు సైతం ‘మీ రికార్డుల్లో తేడాలున్నాయి, మీరు నిరూపించుకోవాలి’ అంటూ నోటీసులు అందడం ఆగ్రహం తెప్పిస్తున్నది. ఇంటి నంబర్లలో అక్షరం మారినా.. ఇంటిపేరు మొదట కాకుండా చివర వచ్చినా.. నోటీసులు ఇచ్చి వివరణ కోరడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాధితులు తహసీల్దార్లను, బీఎల్వోలను ఆశ్రయిస్తే.. ‘మా చేతుల్లో ఏమీ లేదు, పైనుంచి సిస్టమ్ జనరేట్ చేసిన నోటీసులే ఇవి’ అని చేతులెత్తేస్తుండటంతో  ఓటర్లు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. బీఎల్వోలు స్వయంగా ఇంటికి వచ్చి నోటీసులు చేతిలో పెడుతున్నారు. వివరణ ఇవ్వకపోతే ఓటు హక్కు రద్దు చేస్తామని హెచ్చరిస్తున్నారు. పైగా ఓటు హక్కును నిరూపించుకునేందుకు నోటిఫై చేసిన సర్టిఫికెట్ల విషయంలోనూ ఈసీ కఠినంగా వ్యవహరిస్తున్నది. దీంతో నోటీసు అందుకున్న ఓటర్లకు ఇప్పుడు సర్టిఫికెట్ల వేట కష్టంగా మారింది. చిన్నపాటి స్పెల్లింగ్ దోషాన్ని సరిచేసుకోవడానికి సైతం టెన్త్ క్లాస్ మార్కుల మెమోలు, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్, పాస్‌‌పోర్టులు సమర్పించాలని అధికారులు నిబంధనలు పెడుతున్నారు. గ్రామాల్లోని నిరక్షరాస్యులకు, వ్యవసాయ కూలీలకు పాత బర్త్ సర్టిఫికెట్లు తేవడం కత్తిమీద సాములా మారింది.

ప్రజాస్వామ్యానికే సవాలు

‘సర్‌‌‌‌’ ప్రక్రియలో 2026 జనవరి 22న ఈఆర్వో నెట్  వ్యవస్థను ఏకంగా 40కి పైగా అప్లికేషన్లను ఒకే గొడుగు కిందికి తెస్తూ ‘ఈసీఐ నెట్’ అనే కేంద్రీకృత ప్లాట్‌‌ఫామ్‌‌లోకి విలీనం చేసి అప్‌‌డేట్ చేశారు. ఈ అప్‌‌డేట్ వల్ల దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న నకిలీ ఓటర్లను, మరణించిన వారి పేర్లను ఏకీకృత డేటాబేస్ ద్వారా త్వరగా గుర్తించడం సులభతరమైందనే లాభం కనిపిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో తలెత్తుతున్న సమస్యలు ప్రజాస్వామ్యానికే సవాలుగా మారాయి. 2002 నాటి పాత ప్రాథమిక రికార్డులను (తెలుగు, తమిళంలాంటి ప్రాంతీయ భాషల నుంచి) కొత్త సాఫ్ట్‌‌వేర్ ఆటోమేటిక్‌‌గా ఇంగ్లిష్‌‌లోకి తర్జుమా చేసే క్రమంలో అక్షరదోషాలు, వయస్సు తేడాలను సాఫ్ట్‌‌వేర్ ‘లాజికల్ డిస్క్రిపన్సీ’గా ఫ్లాగ్ చేసి ఆటో- నోటీసులు పంపడమే కాకుండా, ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం చట్టబద్ధమైన అధికారాలు కలిగిన అధికారుల చేతులను ఈఆర్వో  పూర్తిగా కట్టేసిం ది. కేంద్రస్థాయిలో ఐటీ విభాగం నియంత్రణ పెరగడం తో ఈఆర్వోలు ఒకసారి సిస్టమ్‌‌లో రిజెక్ట్ అయిన లేదా సరిచేసిన సమాచారాన్ని తిరిగి చేర్చే అవకాశం లేకుం డా సాఫ్ట్‌‌వేర్ నిరోధిస్తున్నది. దీనివల్ల బూత్ లెవెల్ అధికారులు, ఈఆర్వోలు క్షేత్రస్థాయిలో ఓటరు ప్రత్యక్షంగా సరైన ఆధార్, నివాస పత్రాలతో వచ్చినప్పటికీ, డిజిటల్ సిస్టమ్ అంగీకరించకపోవడంతో అర్హుల పేర్లను జాబితా నుంచి తొలగించాల్సి వస్తున్నది.

సీఈవో సుదర్శన్‌‌రెడ్డికీ నోటీసు

రాష్ట్ర చీఫ్‌‌ ఎలక్షన్‌‌ ఆఫీసర్‌‌‌‌ (సీఈవో)  సి.సుదర్శన్ రెడ్డికి కూడా ఈఆర్వో నెట్ ద్వారా నోటీసు వెళ్లడం కేంద్రీకృత సాఫ్ట్‌‌వేర్ యాంత్రిక పనితీరుకు పరాకాష్ట. ఆయన ఆధార్ కార్డులో పూర్తి ఇంటి పేరు ఉండగా, ఓటరు గుర్తింపు కార్డులో కేవలం ‘సి’ అని మాత్రమే ఉండటంతో సాఫ్ట్‌‌వేర్ దాన్ని ‘డేటా తేడా’  గా పరిగణించి ఆటో -నోటీస్ పంపింది.  ప్రధాన ఎన్నికల అధికారి పేరులోని ఒక్క అక్షరం వ్యత్యాసాన్ని సైతం విచక్షణ లేకుండా ఆటోమేటిక్‌‌గా ఫ్లాగ్ చేసి నోటీసు ఇవ్వడం, ఈ వ్యవస్థలో ప్రత్యక్ష మాన్యువల్‌‌ పరిశీలనకు చోటులేదని నిరూపిస్తోంది.  

పేరులో అక్షరం తేడా ఉన్నా..

హైదరాబాద్‌‌లోని లంగర్ హౌస్ డివిజన్‌‌కు చెందిన కమర్ ఫాతిమా (55) చాలాకాలంగా ఒకే ఇంట్లో నివసిస్తూ ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. 2002 నాటి పాత ఓటర్ల జాబితాలో తెలుగు నుంచి ఇంగ్లిష్‌‌లోకి తర్జుమా  చేసే సమయంలో ఆమె పేరును ‘కెమర్‌‌‌‌’ అని నమోదు చేశారు. ప్రస్తుత డిజిటల్ రికార్డులలో ‘కమర్’ అని ఉండటంతో, కేంద్రీకృత సాఫ్ట్‌‌వేర్ రెండింటినీ వేర్వేరు వ్యక్తులుగా నిర్ధారించి నోటీసు జారీ చేసింది. 2002 నాటి పాత నమోదు తప్పు అని నిరూపించుకోవడానికి ఆ వృద్ధురాలు మీసేవా, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ఆధార్, పాత పత్రాలు పట్టుకొని తిరగాల్సి వచ్చింది.  

తండ్రీ, కొడుకుల వయస్సు తేడా ఉన్నా..

రంగారెడ్డి జిల్లాకు చెందిన కూలీ మైసయ్య (60)కు ఈఆర్వో నెట్ సాఫ్ట్‌‌వేర్ నుంచి నోటీస్​ వచ్చింది. 2002 డేటా బేస్​లో ఆయన తండ్రి వయస్సుకు, ఈయన వయస్సుకు మధ్య వ్యత్యాసాన్ని సాఫ్ట్‌‌వేర్ లెక్కించడంలో తప్పు దొర్లడంతో ‘వయస్సు తేడా’ కేటగిరీ కింద నోటీసు వెళ్లింది. దీనికోసం 85 ఏండ్లు పైబడిన తన తండ్రి పాత జనన ధ్రువీకరణ పత్రాలు, పదో తరగతి మెమో తేవాలని అధికారులు సూచించారు. ఏనాడూ బడి ముఖం చూడని నిరక్షరాస్యులైన ఆ నిరుపేద కుటుంబం తమ దగ్గర ఎలాంటి బర్త్ సర్టిఫికెట్లు లేక, ఇతర పత్రాలు లేక, ఊరి సర్పంచ్ సంతకాలు, అఫిడవిట్ల కోసం  కూలీ పనులు మానుకొని తిరగాల్సి వచ్చింది.

స్పెషల్​ సీఎస్‌‌, ప్రిన్సిపల్‌‌ సెక్రటరీలకూ నోటీసులు.

సెక్రటేరియెట్‌‌లో పనిచేస్తున్న  స్పెషల్​ సీఎస్​, మరో ఇద్దరు ప్రిన్సిపల్​సెక్రటరీలకు ‘సర్’​ ఎన్నికల నోటీసులు అందాయి. స్పెల్లింగ్​ మిస్టేక్స్‌‌లో భాగంగా ఈ నోటీసులు రావడంతో.. ఆ అధికారులు ప్రత్యేకంగా బీఎల్వోలను పిలిపించుకొని ధ్రువపత్రాలు ఇచ్చి సరి చేయించుకున్నారు. ఇలా ఉన్నతాధికారులే కాదు.. సినీ నటులు విజయ్ దేవరకొండ, సమంత లాంటి వాళ్లకు కూడా ఇలాంటి నోటీసులే వెళ్లాయి. అయితే వాళ్లకు పాస్​పోర్టు, ఇతర స్టడీ సర్టిఫికెట్లు ఉండటంతో సమస్య తీరిపోయింది.

©️ VIL Media Pvt Ltd.