Reading Time: < 1 minute
Ind Vs Wi 1st Odi Ruturaj Gaikwad Nitish Kumar Reddy In India Playing 11

India Playing 11 West Indies 1st ODI: భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లోని తొలి మ్యాచ్ సెప్టెంబర్ 27న తిరువనంతపురంలో జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే రెండు జట్లు తిరువనంతపురంలో ముమ్మర సాధన చేస్తున్నాయి. స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఏషియన్ గేమ్స్ కోసం జపాన్‌లో బిజీగా ఉండగా.. అతడి స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ జట్టులోకి వచ్చాడు. సీనియర్ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా వన్డే జట్టులోకి రీఎంట్రీ ఇవ్వగా.. ఆకిబ్ నబీ, నమన్ ధీర్ వంటి యువ ఆటగాళ్లకు సెలక్టర్లు అవకాశం ఇచ్చారు. తొలి వన్డే నేపథ్యంలో భారత తుది జట్టుపై అందరిలో ఆసక్తి నెలకొంది.

వెస్టిండీస్‌తో తొలి వన్డేకు మాజీ టీమిండియా ఆటగాడు ఎస్.బద్రీనాథ్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో భారత జట్టును వెల్లడించారు. బద్రీనాథ్ తన జట్టులో యశస్వి జైస్వాల్, నమన్ ధీర్, ధ్రువ్ జురెల్‌లకు అవకాశం ఇవ్వలేదు. శ్రేయస్ అయ్యర్ స్థానంలో భారత జట్టులోకి వచ్చిన రుతురాజ్ గైక్వాడ్‌కు చోటు కల్పించారు. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌లను ఎంపిక చేశారు. విరాట్ కోహ్లీని మూడో స్థానంలో, రుతురాజ్ గైక్వాడ్‌ను నాలుగో స్థానంలో తీసుకున్నారు. వికెట్ కీపర్‌ కేఎల్ రాహుల్‌ను ఐదో స్థానంలో ఎంచుకొన్నారు. ఈ వన్డే సిరీస్‌కు హార్దిక్ పాండ్యా భారత జట్టులో లేకపోవడంతో.. ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌ నితీష్ కుమార్‌కు బద్రీనాథ్ చోటు కల్పించారు.

వెస్టిండీస్‌పై భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన (44 వికెట్లు) స్పిన్ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాకు బద్రీనాథ్ తన జట్టులో చోటిచ్చారు. ప్రధాన స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌కు అవకాశం ఇచ్చారు. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్, గుర్నూర్ బ్రార్‌లను తుది జట్టులో చేర్చారు. ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ నబీకి బద్రీనాథ్ తన జట్టులో చోటు ఇవ్వలేదు. స్టార్లు యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్ సహా నమన్ ధీర్, ఆకిబ్ నబీలను బెంచ్ ఆటగాళ్లుగా ఎంచుకున్నాడు.

తొలి వన్డేకు బద్రీనాథ్ తుది జట్టు:
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, గుర్నూర్ బ్రార్.