
ముంబై వీధుల్లో ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు తన 3 ఏళ్ల చిన్నారి కూతురిని పక్కన కూర్చోబెట్టుకుని ఆటో నడుపుతున్న కోమల్ గైక్వాడ్ అనే తల్లి కథ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోమల్ కూతురు తేజస్వికి కేవలం 18 నెలల వయసు ఉన్నప్పుడు ఆమె భర్త వారిని ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయాడు. చిన్న బిడ్డతో ఒంటరిగా మిగిలిపోయిన కోమల్, జీవనోపాధి కోసం ఎన్నో ఉద్యోగాల కోసం ప్రయత్నించింది. అయితే, చిన్న పాపను వెంటబెట్టుకుని వస్తుండటంతో ఎవరూ ఆమెకు పని ఇవ్వడానికి ముందుకు రాలేదు. దాంతో బిడ్డను తన వద్దే ఉంచుకుని స్వతంత్రంగా సంపాదించేందుకు ఆటో డ్రైవర్‌గా మారాలని నిర్ణయించుకుంది.
ఉదయం 6 నుండి రాత్రి 11 వరకు రోడ్లపైనే:
కోమల్ ప్రతిరోజూ ఉదయం 6 గంటలకే తన చిన్నారిని ఆటో సీటు పక్కన కూర్చోబెట్టుకుని రోడ్లపైకి వస్తుంది. మధ్యాహ్నం ఇంటి పనుల కోసం కాసేపు విరామం తీసుకుని, మళ్లీ రాత్రి 11 గంటల వరకు ఆటో నడుపుతూనే ఉంటుంది. ఆటో రోడ్లపై తిరుగుతున్నంత సేపు ఆ చిన్నారి తల్లి పక్కనే కూర్చుంటుంది. అలసటగా అనిపించినప్పుడు ఆటో వెనుక సీటులోనే నిద్రపోతుంది.
కూతురిని IPS చేయడమే లక్ష్యం:
ఇంటి అద్దె, కరెంట్ బిల్లులు, ఇతర ఖర్చులన్నీ కోమల్ ఒక్కత్తే భరిస్తోంది. నా బిడ్డను భవిష్యత్తులో ఐపీఎస్ (IPS) అధికారిణిగా చేయడమే నా జీవిత లక్ష్యం. అలాగే మాకు మా సొంత ఇల్లు ఉండాలి.. అద్దె ఇళ్లు మారుతూ ఇబ్బంది పడకూడదు అని కోమల్ చెబుతోంది.
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పోస్ట్ చేసిన ఒక వీడియో ద్వారా కోమల్ కథ వెలుగులోకి వచ్చింది. ఇన్స్టాగ్రామ్‌లో ఈ వీడియోకు కోటి పైగా వ్యూస్, లక్షలాది లైక్స్ వచ్చాయి. భర్త లేకపోయినా, సమాజంలో ఎలాంటి మద్దతు లేకపోయినా ఒంటరిగా పోరాడుతూ బిడ్డను గొప్పగా పెంచాలనుకుంటున్న కోమల్ గైక్వాడ్ కథ ప్రతిఒక్కరికీ స్ఫూర్తిదాయకం. కల్యాణ్‌కి చెందిన కోమల్ గైక్వాడ్ తన 3 ఏళ్ల కుమార్తెతో కలిసి ఆటో నడుపుతూ సాగిస్తున్న పోరాటం తెలిసిన ప్రతి ఒక్కరూ చలించిపోయారు.