Reading Time: < 1 minute
India Us Ties Us Becomes Largest Lpg Supplier Energy Defence Shanti Act

US LPG Supply: భారత్, అమెరికాల మధ్య బంధం గత ఏడాది కాలంలో మరింత బలపడింది. ముఖ్యంగా ఇంధన రంగంలో ఇరు దేశాల మధ్య వ్యాపారం గణనీయంగా పెరిగింది. మన దేశానికి ఎల్‌పీజీ (LPG) సరఫరా చేయడంలో అమెరికా ఇప్పుడు అగ్రస్థానానికి చేరుకుంది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ సీనియర్ అధికారిణి బెథానీ మోరిసన్ స్వయంగా వెల్లడించారు. న్యూయార్క్‌లోని ఫారిన్ ప్రెస్ సెంటర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన మోరిసన్, గతేడాది కాలంలో రెండు దేశాల మధ్య భాగస్వామ్యం ఎంతగానో విస్తరించిందని తెలిపారు. ప్రస్తుతం భారత్-అమెరికాలు కేవలం ఒక్క రంగంలోనే కాకుండా ఇంధనం, రక్షణ, విదేశాంగ వ్యవహారాలు, వ్యాపారం వంటి కీలక విభాగాల్లో భుజం భుజం కలిపి పనిచేస్తున్నాయని చెప్పారు.

భారత్ తన ఇంధన అవసరాల కోసం కేవలం ఒకే దేశంపై ఆధారపడకుండా విభిన్న మార్గాల ద్వారా సరఫరాను పెంచుకుంటోందని, ఈ క్రమంలో అమెరికా ఒక ప్రధాన సప్లయర్‌గా అవతరించిందని ఆమె పేర్కొన్నారు. భారత్‌కు అత్యధికంగా ఎల్‌పీజీని ఎగుమతి చేసే దేశంగా అమెరికా నిలవడం తమకు ఎంతో గర్వకారణమని, ఇంధన వనరులను విస్తరించుకునే భారత ప్రయత్నంలో తాము భాగస్వామి కావడం సంతోషంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. దీంతోపాటు ఇరు దేశాల మధ్య కుదిరిన 10 ఏళ్ల రక్షణ ఒప్పందాన్ని (డిఫెన్స్ ఫ్రేమ్‌వర్క్ అగ్రిమెంట్) కూడా మోరిసన్ ప్రస్తావించారు. రక్షణ రంగంతో పాటు అణు ఇంధన రంగంలోనూ ఇరు దేశాలు వేగంగా అడుగులు వేస్తున్నాయని చెప్పారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత భారత్ తన అణు రంగానికి సంబంధించిన నిబంధనల్లో మార్పులు చేస్తూ ‘శాంతి చట్టం’ (SHANTI Act) తీసుకువచ్చిందని, దీనివల్ల పౌర అణు ఇంధన రంగంలో రెండు దేశాల మధ్య సహకారం మరింత పెరిగే అవకాశం ఉందని వివరించారు. భారత్, అమెరికా బంధం కేవలం ఇంధనం, రక్షణ రంగానికే పరిమితం కాలేదని, రెండూ కలిసి పెద్ద ఎత్తున వ్యాపార ఒప్పందాలు చేసుకుంటున్నాయని మోరిసన్ తెలిపారు. ‘క్వాడ్’ వంటి కీలక వేదికలపై కూడా ఇరు దేశాలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయని చెప్పారు. ట్రంప్ ప్రభుత్వానికి దక్షిణ ఆసియా ప్రాంతం ఎంతో కీలకమైనదని స్పష్టం చేసిన ఆమె, గతంలో ప్రపంచంలో ఎక్కడైనా ఏదైనా సంక్షోభం వచ్చినప్పుడు మాత్రమే దక్షిణ ఆసియాపై దృష్టి పెట్టేవారని గుర్తుచేశారు.