
ఈ మధ్యన తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన సినిమాలు సంచలనాలు సృష్టిస్తున్నాయి. వాస్తవానికి దగ్గరగా ఉండే కథలు, కథనాలతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా సేమ్ టు సేమ్ ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ సినిమా గురించే. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే.. ఇది క్రైమ్ థ్రిల్లర్ సినిమానే అయినా మీరు ఈ మూవీని మీ కుటుంబంతో కలిసి హాయిగా ఆస్వాదించవచ్చు. ప్రస్తుతం ఈ చిత్రానికి IMDBలో 8.6 రేటింగ్ ఉంది. ఈ సినిమా 2016లో విడుదలైంది, కానీ నేటికీ ఆడియెన్స్ ఈ సినిమాను తెగ చూసేస్తున్నారు. సుమారు 1 గంట 45 నిమిషాల నిడివి గల ఈ సినిమా ఓటీటీలో ఉన్న ది బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్స్ లో ఒకటని చెప్పవచ్చు. ఇందులో తెలుగు ఆడియెన్స్ కు బాగా పరిచయమున్న కన్నడ హీరో రక్షిత్ శెట్టి శివ అనే యువకుడి పాత్రలో అద్భుతంగా నటించారు. ఈ సినిమా స్టోరీ విషయానికివస్తే.. అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న ఒక వృద్ధుడు అకస్మాత్తుగా అదృశ్యమవ్వడంతో ఈ సినిమా కథ మొదలవుతుంది. ఆ తర్వాత అతడిని వెతికే కథ మొదలవుతుంది. ఈ చిత్రంలో అనంత్ నాగ్ నటన ఒక ప్రధాన ఆకర్షణ. ఆయన అల్జీమర్స్‌తో బాధపడుతున్న వెంకోబ్ రావు పాత్రను ఎంతో అమాయకమైన పాత్రను అద్బుతంగా పోషించారు. మరోవైపు కార్పొరేట్ కంపెనీలో పనిచేసే శివ బిజీ బిజీగా లైఫ్ గడుపుతుంటాడు. దీంతో క్రమంగా తన తండ్రి వెంకోబరావుకు దూరమవుతాడు. ఒకరోజు ఉన్నట్లుండి శివ తండ్రి కనిపించకుండా పోతాడు. దీంతో శివ ఆయనను వెతకడానికి బయలుదేరతాడు. ఈ ప్రయాణంలో, అతను తన తండ్రి గురించి ఎన్నో విషయాలు అర్థం చేసుకోవడమే కాకుండా, వారి మధ్య ఉన్న సంబంధాన్ని, ఆయన చేసిన తప్పులను కూడా ఒక కొత్త కోణంలో చూడటం ప్రారంభిస్తాడు. ఈ చిత్రం తండ్రీకొడుకుల బంధాన్ని, తీరికలేని జీవితంలో కుటుంబానికి కేటాయించే సమయం తగ్గిపోవడాన్ని ఈ సినిమాలో చక్కగా చూపించారు.
ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ఈ సినిమాలో క్రైమ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. వెంకోబ్ రావు అదృశ్యమైన తర్వాత కథ వేరే మలుపు తీసుకుంటుంది. అతను అనుకోకుండా ఒక కాంట్రాక్ట్ కిల్లర్ తో పరిచయం ఏర్పరచుకుంటాడు. ఒకవైపు శివ తన తండ్రి కోసం వెతుకుతుండగా, మరోవైపు ఆ నేరానికి సంబంధించిన రహస్యాలు కథలో క్రమంగా వెలుగులోకి వస్తాయి. మొత్తానికి ఊహించని ట్విస్టులు, సస్పెన్స్ తో సాగే ఈ సినిమా చివరి వరకు ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతుంది.
ఈ సినిమా పేరు ‘గోధి బన్న సాధారణ మైకట్టు’. ఇదొక కన్నడ సినిమా. శ్రీమన్నారాయణ, ఛార్లీ 777, సప్త సాగరాలు దాటి వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా చేరువైన కన్నడ హీరో రక్షిత్ శెట్టి ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించాడు . ఆద్యంతం థ్రిల్లింగ్ గా, ఎమోషనల్ గా సాగే ఈ సినిమా ప్రస్తుతం జియో హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి