Reading Time: 2 minutes
Bollywood Actor Mushtaq Khan Dies At 56 Welcome Aashiqui

Mushtaq Khan: బాలీవుడు ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ‘వెల్కమ్’, ‘ఆషికి’, ‘ముజ్సే షాదీ కరోగి’, ‘హమ్ హైన్ రాహీ ప్యార్ కే’ వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో తనదైన నటనతో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ప్రముఖ సీనియర్ నటుడు ముష్తాక్ ఖాన్ కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం (సెప్టెంబర్ 24) తుదిశ్వాస విడిచారు. ఆయన గత ఐదేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. మధ్యలో కాస్త కోలుకున్నప్పటికీ, ఇటీవల ఈ వ్యాధి తిరగబెట్టడంతో పరిస్థితి విషమించింది. బిజినెస్ భాగస్వామి శివమ్ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడిస్తూ ముష్తాక్ ఖాన్ మరణాన్ని ధృవీకరించారు. శుక్రవారం (సెప్టెంబర్ 25న) ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ముష్తాక్ ఖాన్ అంటే బాలీవుడ్‌లో తెలియని వారు ఉండరు. ఈ హాస్యనటుడు ముస్తాక్ ఖాన్ (Mushtaq Khan) తన మూడు దశాబ్దాల సినీ కెరీర్‌లో 200 నుంచి 400 కి పైగా చలనచిత్రాలు, టెలివిజన్ సిరీస్‌లలో నటించారు. హీరో పక్కన ఉండే సపోర్టింగ్ క్యారెక్టర్లు, కడుపుబ్బా నవ్వించే కామెడీ పాత్రలతో ఆయన తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ‘వెల్కమ్’ సినిమాలో ఆయన చేసిన కామెడీ రచ్చను అభిమానులు ఇప్పటికీ మరచిపోలేరు. దశాబ్దాల తరబడి తన నటనతో, హాస్యంతో కోట్లాది మంది ముఖాల్లో చిరునవ్వులు పూయించిన నటుడు ఇలా హఠాత్తుగా దూరమవ్వడంతో సినీ లోకం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు.

ఇక, ముస్తాక్ ఖాన్ నటుడిగానే కాకుండా, జీవితంలో ఎదుర్కొన్న కొన్ని చేదు అనుభవాలు కూడా గతంలో వార్తల్లో నిలిచాయి. ముఖ్యంగా 2024 నవంబర్ 20న ఆయన ఒక భయంకరమైన కిడ్నాప్ డ్రామాను ఎదుర్కొన్నారు. మీరట్‌లో ఒక ఈవెంట్ ఉందంటూ ముష్తాక్ ఖాన్‌ను నమ్మించి పిలిపించిన కిడ్నాపర్లు, ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ వద్ద కార్ ఎక్కించుకుని బిజ్నోర్‌కు తీసుకెళ్లి బంధించారు. దాదాపు 12 గంటల పాటు ఆయనను చిత్రహింసలు పెట్టి, రూ. 1 కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే సినీ పరిశ్రమలో పనిచేసే నటులందరి దగ్గరా కోట్లు ఉంటాయని వారు అనుకున్నారని, కానీ తన దగ్గర అంత డబ్బు లేదని తెలిసి ఆ కిడ్నాపర్లు ఆశ్చర్యపోయారని ముష్తాక్ ఖాన్ అప్పట్లో వెల్లడించారు. ఆ నరకం నుంచి ముస్తాక్ ఖాన్ ఎలాగోలా ప్రాణాలతో బయటపడి తన ఆవేదనను పంచుకున్నారు. అలా జీవితంలో ఎన్నో హెచ్చుతగ్గులు చూసిన ఈ అద్భుత నటుడు, ఇప్పుడు అనారోగ్యంతో శాశ్వతంగా కన్నుమూయడం సినీ రంగానికి తీరని లోటు.