Reading Time: 2 minutes

బంగారం కొనుడు కాదు తాకట్టుపెట్టుడు పెరిగింది.. అప్పులు పుట్టకనే గోల్డ్ లోన్స్ ట్రెండ్!

Caption of Image.

ప్రస్తుతం దేశీంలో పర్సనల్ లోన్ మార్కెట్ రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి. ఒకప్పుడు క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్స్ కోసం ఎగబడిన జనం.. ఇప్పుడు బ్యాంకుల కొర్రీలతో అన్‌సెక్యూర్డ్ లోన్స్ దొరక్క అల్లాడిపోతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో ఇంట్లో ఉన్న బంగారాన్ని నమ్ముకుని గోల్డ్ లోన్స్ తీసుకునే వారి సంఖ్య ఊహించనంతగా పెరిగింది. RBI నిబంధనల సడలింపు, ఆకాశాన్నంటుతున్న బంగారం ధరలు దీనికి ఊతమిచ్చాయి.

4 రెట్లు ఎగబాకిన గోల్డ్ లోన్స్:
దేశంలో బంగారంపై తీసుకునే రుణాలు కేవలం రెండేళ్ల వ్యవధిలో ఏకంగా 4.4 రెట్లు పెరిగాయని ఏకంగా రిజర్వు బ్యాంక్ లెక్కలే చెబుతున్నాయి. 2024 జూలైలో రూ.లక్షా 24వేల కోట్లుగా ఉన్న గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియో.. 2025 జూలై నాటికి రూ.2 లక్షల 6వేల కోట్లకు, 2026 జూలై కల్లా ఏకంగా రూ.5లక్షల 52వేల కోట్లకు దూసుకుపోయింది. మొత్తం పర్సనల్ లోన్స్ 2024లో కేవలం 2.2 శాతంగా ఉన్న గోల్డ్ లోన్ల వాటా.. 2026 నాటికి 7.7 శాతానికి పెరిగటం గమనార్హం.

అన్‌సెక్యూర్డ్ లోన్స్ కట్.. రూటు మార్చిన బ్యాంక్స్:
క్రెడిట్ కార్డు రుణాలు, ఎడ్యుకేషన్ లోన్లు, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ లోన్స్ ఇవ్వడానికి బ్యాంకులు వెనుకడుగు వేస్తున్నాయి. అన్‌సెక్యూర్డ్ మార్కెట్‌లో రిస్క్ పెరగడంతో లెండర్లు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. బకాయిలు చెల్లించకపోతే రికవరీ కష్టమవుతుందనే భయంతో బ్యాంకులు సెక్యూర్డ్ లెండింగ్‌కు ప్రాధాన్యమిస్తున్నాయి. గోల్డ్ లోన్లలో మాత్రం అసెట్ క్వాలిటీ చాలా కంఫర్టబుల్‌గా ఉంది. జూన్ గణాంకాల ప్రకారం 90 రోజులకు పైగా బకాయిలు పడినవి కేవలం 0.2 శాతమే ఉన్నాయి.

RBI కొత్త రూల్స్ బలం:
బంగారం ధరలు భగభగ మండుతుండటంతో పాటు, ఆర్బీఐ తీసుకొచ్చిన కొత్త కొల్లేటరల్ ఫ్రేమ్‌వర్క్ చిన్న రుణాలను మరింత ఆకర్షణీయంగా మార్చింది. సవరించిన నిబంధనల ప్రకారం.. రూ.2.5 లక్షల వరకు రుణం తీసుకునేవారికి బంగారం విలువలో గరిష్టంగా 85 శాతం వరకు లోన్ ఇస్తున్నారు. పంజాబ్ నేషనల్ లాంటి ప్రభుత్వ బ్యాంకులు సైతం ఈ విభాగంలో దూకుడు పెంచాయి. 

దక్షిణాదిదే హవా.. ఇతర రాష్ట్రాల్లోనూ జోరు
గోల్డ్ లోన్లలో ఇప్పటికీ దక్షిణాది రాష్ట్రాలదే పైచేయిగా ఉంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, కేరళ రాష్ట్రాలు కలిసి మొత్తం గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియోలో 70 శాతానికి పైగా వాటాను కలిగి ఉన్నాయి. ఒక్క తమిళనాడులోనే 30 శాతం వాటా ఉంది. అయితే ఇప్పుడు ఈ గోల్డ్ లోన్స్ గ్రోత్ కేవలం సౌత్ ఇండియాకే పరిమితం కాకుండా ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లోనూ విపరీతంగా పాకింది.

©️ VIL Media Pvt Ltd.