
బాలాపూర్ గణేష్ అంటే తెలియని వారెవరూ ఉండరేమో. ఖైరతాబాద్ మహాగణపతికి ఎంత పేరుందో.. దాదాపు అంత పాపులారిటీ సంపాదించింది. గణనాథుని లడ్డూ ప్రసాదం వేలంతో రికార్డులు సృష్టిస్తూ ఫేమస్ అయిన బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంలో ఎప్పట్లాగే ఈసారి కూడా గతేడాది రికార్డును అధిగమించింది. వేలంలో లడ్డూ ప్రసాదం 39 లక్షల రూపాయలు పలికింది. గతేడాది 35 లక్షల రూపాయలు పలికిన లడ్డూ ఈ సారి 39 లక్షలు పలకడం విశేషం.
లడ్డూ వేలంలో 8 మంది పోటీ పడగా.. సాహెబ్‌నగర్‌కు చెందిన అర్బన్ గ్రూప్ అధినేత సామ ప్రణీత్ రెడ్డి దక్కించుకున్నారు. లడ్డూ తమ చేతికి రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా బాలాపూర్ లడ్డూ వేలం పాటలో పాల్గొంటున్నానని, ఈసారి లడ్డూను దక్కించుకోవడం తనతో పాటు తన కుటుంబ సభ్యులు, అభిమానులకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు.
బాలాపూర్ గణేష్ స్వామివారి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ప్రణీత్ రెడ్డి అన్నారు. లడ్డూను దక్కించుకున్న అనంతరం సాహెబ్‌నగర్‌కు చెందిన కాలనీవాసులు, అభిమానులు, అనుచరులు బాలాపూర్ నుంచి భారీ ర్యాలీగా డీజే పాటలకు తీన్మార్ స్టెప్పులు వేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అర్బన్ గ్రూప్ ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తన ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా సామ ప్రణీత్ రెడ్డి తెలిపారు.