
Oman Cricket: జపాన్‌లోని ఐచి-నాగోయా వేదికగా ఆసియా క్రీడలు 2026 జరుగుతున్నాయి. ఈ క్రీడల్లో భాగంగా హాంకాంగ్‌తో జరిగిన పురుషుల క్రికెట్ మ్యాచ్‌లో ఒమన్ జట్టు 41 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అయితే, మ్యాచ్ ఫలితం కంటే కూడా ఒమన్ మైదానంలోకి దింపిన ప్లేయింగ్ ఎలెవన్ ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ మ్యాచ్‌లో ఒమన్ జట్టు తరఫున ఒకే ఇంటిపేరు ఉన్న ఏడుగురు ఆటగాళ్లు ఒకేసారి మైదానంలోకి దిగడం విశేషం. కేవలం ప్లేయింగ్ ఎలెవన్‌లోనే కాకుండా, మొత్తం ఒమన్ స్క్వాడ్‌ను పరిశీలిస్తే ఈ ఒకే ఇంటిపేరు గల ఆటగాళ్లు తొమ్మిది మంది ఉండటం గమనార్హం.
సెప్టెంబరు 25 శుక్రవారం రోజున నిషిన్‌లోని కొరోగి స్పోర్ట్స్ పార్క్‌లో ఈ ఆసక్తికర మ్యాచ్ జరిగింది. సుఫియాన్ మహమూద్ నాయకత్వంలో బరిలోకి దిగిన ఒమన్ తుది జట్టులో మహమ్మద్ అల్ బలూషి, షుయైబ్ అల్ బలూషి, జుబైర్ అల్ బలూషి, వహీద్ అల్ బలూషి, ఈసా అల్ బలూషి, నవీద్ అల్ బలూషి, ఫారిస్ అల్ బలూషి ఆడారు. అంటే టీమ్‌లోని 11 మందిలో ఏకంగా ఏడుగురి పేర్ల చివర ‘అల్ బలూషి’ అనే ఇంటిపేరే ఉంది. అంతేకాకుండా జట్టు బెంచ్ మీద ఉన్న వసీమ్ అల్ బలూషి, కైస్ అల్ బలూషిలను కూడా కలిపితే మొత్తం తొమ్మిది మంది ‘అల్ బలూషి’లు ఈ స్క్వాడ్‌లో ఉన్నారు.
ఇక బ్యాటింగ్ ఆర్డర్ విషయానికి వస్తే, ఒమన్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన మొదటి నలుగురు బ్యాటర్లు కూడా ఈ బలూషి కుటుంబ సభ్యులే కావడం మరొక వింత. మహమ్మద్ అల్ బలూషి, షుయైబ్ అల్ బలూషి, జుబైర్ అల్ బలూషి, వహీద్ అల్ బలూషి వరుసగా 1 నుంచి 4 స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చారు. కానీ హాంకాంగ్ బౌలర్ల ధాటికి వీరెవరూ భారీ స్కోర్లు చేయలేకపోయారు. ఈ ఆటగాళ్ల అంతర్జాతీయ అనుభవాన్ని చూస్తే, మహమ్మద్ అల్ బలూషి ఈ ఏడాదే ఒమన్ తరఫున టీ20 అరంగేట్రం చేసి ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడాడు. ఈ ఏడాది జూన్ 3న బహ్రెయిన్‌పై చేసిన 81 పరుగులే ఇతని అత్యుత్తమ స్కోరు. 30 ఏళ్ల ఆల్‌రౌండర్ షుయైబ్ అల్ బలూషి కూడా ఆరు టీ20లు ఆడి 117 పరుగులు చేయడంతో పాటు నాలుగు వికెట్లు పడగొట్టాడు. జుబైర్ అల్ బలూషి ఖాతాలోనూ ఆరు టీ20లు ఉండగా, వహీద్ అల్ బలూషి హాంకాంగ్‌తో జరిగిన ఈ మ్యాచ్ ద్వారానే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. బౌలింగ్ విభాగంలో నవీద్ అల్ బలూషి ఐదు టీ20లు ఆడి ఏడు వికెట్లు తీశాడు, సింగపూర్‌పై అరంగేట్ర మ్యాచ్‌లోనే 22 పరుగులిచ్చి 4 వికెట్లు తీయడం ఇతని అత్యుత్తమ ప్రదర్శన. మరో ఆటగాడు ఫారిస్ అల్ బలూషి రెండు టీ20 మ్యాచ్‌లు ఆడి 10 పరుగులు చేశాడు.