
- అడ్డు వచ్చిన పోలీసులను తోసేసిన వ్యక్తులు.. లాఠీలకు పనిచెప్పిన పోలీసులు
- కొత్తగూడెం త్రీటౌన్ పీఎస్ వద్ద ఘటన
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: భార్యాభర్తల పంచాయితీలో ఫిర్యాదు చేసుకునేందుకు పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఇరువర్గాలు అక్కడే పరస్పరం దాడి చేసుకున్నారు. అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులను సైతం తోసేయడంతో వారు లాఠీలకు పనిచెప్పారు. అయినా పట్టించుకోకపోవడంతో చివరకు పోలీస్ స్టేషన్ తలుపులు మూసేశారు.
ఈ ఘటన కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని త్రీటౌన్ పోలీస్ స్టేషన్ వద్ద శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే… కొత్తగూడెం నగరానికి చెందిన కొరదల కుమార్, అతని భార్య వినోద మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో పరస్పరం ఫిర్యాదు చేసుకునేందుకు ఇరువర్గాల వారు శుక్రవారం కొత్తగూడెం త్రీ టౌన్పీఎస్ కు వచ్చారు. ఈ సమయంలో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరగడంతో పోలీసుల ఎదుటే ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. దాడిలో దున్నపోతుల రాజు, వెంకటమల్లుకు గాయాలయ్యాయి.
గమనించిన పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో వారిని సైతం తోసేయడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పి చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అనంతరం ఇరువర్గాలపై పంచాయితీ కేసులతో పాటు పోలీస్ సిబ్బంది విధులకు ఆటంకం కలిగించారన్న కేసులు సైతం నమోదు చేశారు. దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.