
ఖైరతాబాద్ బడా గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. ‘జై జై గణేషా.. బై బై గణేషా’ అంటూ లక్షలాది మంది భక్తులు గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. తొమ్మిది రోజులు ఘనంగా భక్తులనుంచి పూజలందుకున్న బడా గణపయ్యను భక్తిశ్రద్ధలతో, కోలాహలంగా ఊరేగిస్తూ గంగమ్మ ఒడికి సాగనంపే నిమజ్జన వేడుకలు భక్తుల్లో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపాయి. ‘మళ్లీ త్వరగా రావయ్యా’ అంటూ డప్పుల మోతలు, భక్తుల జైజై నినాదాల అంగరంగ వైభవంగా గంగఒడికి సాగనంపారు భక్తులు.
శుక్రవారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైన బడా గణేషుడి శోభాయాత్ర దాదాపు ఐదు గంటల పాటు కొనసాగింది. లక్షలాది మంది భక్తుల సందడితో నగర వీధుల్లో సాగిన ఈ మహా ఊరేగింపు టెలిఫోన్ భవన్, ఇక్బాల్ మినార్ చౌరస్తా మీదుగా సచివాలయం వద్దకు చేరుకుంది. అక్కడి నుంచి ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన నిమజ్జన పాయింట్‌కు బడా గణేష్‌ను తరలించారు. మధ్యాహ్నం 2.30 గంటలకు బాహుబలి క్రేన్ పాయింట్-4 వద్ద గణనాథుడిని క్రేన్ సహాయంతో గంగమ్మ ఒడికి చేర్చడంతో నిమజ్జన ఘట్టం పూర్తయింది.
ఈసారి ఖైరతాబాద్ బడా గణేష్ శోభాయాత్ర భక్తుల భారీ సందడితో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డప్పుల మోతలు, భక్తుల జైజై నినాదాలు, రంగురంగుల అలంకరణల మధ్య సాగిన యాత్ర హైదరాబాద్ నగరంలో పండుగ వాతావరణాన్ని నింపింది. ఆధ్యాత్మిక శోభతో నగర వీధులు కళకళలాడాయి.
మహాగణపతిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గణనాథుడిపై పూలు చల్లుతూ, డోలు వాయిస్తూ, నృత్యాలు చేస్తూ భక్తులు శోభాయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ‘జై జై గణేషా’ నినాదాలతో పరిసర ప్రాంతాలు మార్మోగాయి.
మరోవైపు, భారీగా తరలివచ్చిన భక్తుల నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. బడా గణేష్ వాహనం చుట్టూ రోప్ పార్టీని ఏర్పాటు చేసి, శోభాయాత్ర సజావుగా సాగేలా చర్యలు చేపట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు నిరంతరం పర్యవేక్షించారు.