
తెలంగాణ అడవుల్లో కొత్త జీవం పురుడు పోసుకుంటోంది.. పులులు, చిరుతలతోపాటు జింకలు, నక్కలు, అడవి పందుల పిల్లలు సందడి చేస్తున్నాయి. మేటింగ్ సీజన్ ముగింపు దశకు చేరుకోవడంతో తెలంగాణ అడవుల్లో వన్యప్రాణుల కొత్త తరం కళకళలాడుతోంది.
అడవిలో ఇప్పుడు పులుల సందడి కనిపించదు.. కానీ వాటి గర్జనలు, అడుగుజాడల వెనుక ఓ కీలక ప్రక్రియ జరుగుతోంది. పులుల మేటింగ్ సీజన్ కావడంతో తెలంగాణ టైగర్ రిజర్వులు నిశ్శబ్దంగా మారాయి. పులుల జంటలకు ఎలాంటి అంతరాయం కలగకుండా అటవీశాఖ పర్యాటకులపై ఆంక్షలు విధించింది. దీంతో పులులు జత కట్టి కూనలకు జన్మనిచ్చేందుకు మార్గం సుగమం అయింది.
తెలంగాణలోని అమ్రాబాద్, కవాల్ పులుల అభయారణ్యాల్లో ఈ వర్షాకాలంలో పులులు, చిరుతలతోపాటు ఇతర వన్యప్రాణుల సంతానోత్పత్తికి ఉద్దేశించిన మేటింగ్ సీజన్ మరో మూడు రోజుల్లో ముగియనుంది. ఈ సీజనులో పులులే కాకుండా చిరుతలు, జింకలు, నక్కలు, అడవి పందులు పిల్లలకు జన్మనివ్వడంతో అడవుల్లో వన్యప్రాణుల సంఖ్య పెరిగిందని అటవీశాఖ జన్నారం ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ ఎం. రామ్మోహన్ చెప్పారు.
అభయారణ్యాల్లో మేటింగ్ సీజన్ వల్ల వన్యప్రాణుల పిల్లలు కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. నెమళ్లు, వివిధ జాతుల పక్షులు గుడ్లు పెట్టి పిల్లలకు జన్మనివ్వడంతో అడవుల్లో పక్షుల కిలకిలరావాలు కూడా పెరిగాయంటున్నారు. వర్షాలతో అడవుల్లో పచ్చదనం పరుచుకోవడం, నీటి లభ్యత పెరగడంతో వన్యప్రాణులకు అనుకూల వాతావరణం ఏర్పడింది. మరోవైపు నెమళ్లు, వివిధ రకాల పక్షులు గుడ్లు పెట్టి పిల్లలను పొదగడంతో అడవుల్లో పక్షుల సందడి కూడా పెరిగింది. తెల్లవారుజామునే వినిపించే పక్షుల కిలకిలరావాలు.. అడవుల్లో కొత్త జీవానికి స్వాగతం పలుకుతున్నట్లుగా మారాయి.
కూనలతో కీకారణ్యాలు కళకళ
ముగియనున్న వర్షాకాలం అడవుల్లో పులులే కాదు ఇతర వన్యప్రాణుల కలయికకు అనుకూల సమయం. ఈ కాలంలో మగ పులులు ఆడ పులులను వెతుక్కుంటూ అడవిలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లి వాటిని ఆకర్షించి జత కలుస్తుంటాయి. మేటింగ్ సీజన్లో ఆడపులులు సురక్షిత ఆవాసాలను ఎంచుకుని కూనలకు జన్మినిస్తుంటాయి.
మేటింగ్ సీజన్లో పులులే కాకుండా ఇతర వన్యప్రాణుల కలయిక, సహజీవనానికి భంగం కలగకుండా అడవుల్లో, సఫారీల్లో సందర్శకుల రాకపోకలను తెలంగాణ అటవీశాఖ అధికారులు మూడు నెలలపాటు నిషేధించడంతో పులులతోపాటు పలు వన్యప్రాణుల సంతానోత్పత్తి సజావుగా జరిగిందని అమ్రాబాద్ అటవీశాఖ అధికారి ముహమ్మద్ అహ్మద్ పాషా చెప్పారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో 2026 ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్‌లో 42 పులులున్నాయని తేలింది.
గతంలో18 ఆడ,14 మగ పులులతోపాటు పది పులి కూనలు ఉన్నాయి. ఈ ఏడాది మేటింగ్ సీజన్లో చురుకైన సంతానోత్పత్తి జరుగుతున్నదనడానికి సంకేతంగా అడవిలో పులి కూనల సంచారం పెరిగిందని అటవీశాఖకు చెందిన హెడ్ నేచురలిస్ట్ అఖిల్ మైలవరపు చెప్పారు. మేటింగ్ సీజన్లో జత కలిసేందుకు మహారాష్ట్రలోని టైగర్ రిజర్వుల నుంచి పులులు తెలంగాణ అడవుల్లోకి వచ్చాయని కవాల్ అటవీశాఖ ఫీల్డ్ అధికారులు చెప్తున్నారు. దీంతో కవ్వాల్ టైగర్ రిజర్వ్‌ల్లో కూడా పులుల సంచారం పెరిగింది.
వన్యప్రాణుల సంతానోత్పత్తి కోసం…
తెలంగాణలో వన్యప్రాణుల సంతానోత్పత్తి కోసం జూ అథారిటీ అధికారులు హైదరాబాద్‌లోని నెహ్రూ జంతు ప్రదర్శనశాల కేంద్రంగా పలు కార్యక్రమాలు చేపట్టారు. అంతరించిపోతున్న రాబందులు, ఎలుక జింకలు, మడుగు మొసళ్ల సంతానోత్పత్తి చేసి వాటిని అడవిలోకి విడుదల చేశారు. జూ పార్కులో ఆసియా సింహం, రాయల్ బెంగాల్ టైగర్, ఖడ్గమృగం, ఏనుగు, నీలగిరి లంగూర్, సింహపు తోక గల కోతి, కృష్ణ జింక, మచ్చల జింక, సాంబార్ జింక, నీల్గాయ్, పెలికాన్, కొండచిలువ, మెత్తటి పెంకు తాబేళ్లను బ్రీడింగ్ కార్యక్రమం ద్వారా పెంచి ఆయా అరుదైన జాతులు అంతరించి పోకుండా కార్యక్రమాలు చేపట్టామని తెలంగాణ జూ పార్కుల డైరెక్టర్ డాక్టర్ సునీల్ ఎస్. హీరేమత్ చెప్పారు.
ఎలుక జింకలను పెంచి వాటిని అమ్రాబాద్, కవాల్ పులుల అభయారణ్యాల్లో విడుదల చేశారు.అంతరించిపోతున్న తెల్లవీపు రాబందులు, పొడవాటి ముక్కు రాబందులు, సన్నని ముక్కు రాబందుల జాతులను వృద్ధి చేసే లక్ష్యంతో జూపార్క్‌ల్లో ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ధోల్స్, బంగారు నక్కలు, తెల్ల, బెంగాల్ టైగర్ పులుల సంతానోత్పత్తి కొనసాగుతోంది. జూ అధికారులు భారతీయ తోడేళ్లను బందీగా ఉంచి విజయవంతంగా సంతానోత్పత్తి చేశారు. నాలుగు కొమ్ముల జింకలు, కృష్ణజింకలు, నీల్గాయ్, సాంబార్ జింకలు, ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు ప్రతీ ఏటా పిల్లలకు జన్మనిస్తున్నాయి.
నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో ఉన్న ఐదు రాబందులకు తోడుగా గుజరాత్‌లోని జునాగఢ్ సక్కర్‌బాగ్ జూ నుంచి మరో ఆరు రాబందులను తీసుకొచ్చి సంతానోత్పత్తి చేశారు. రాబందులకు వారానికి రెండుసార్లు 20 కిలోల మేక కళేబరాన్ని ఆహారంగా అందించారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి ఫారెస్ట్ నుంచి సంతానోత్పత్తి కోసం రాబందులను తీసుకొచ్చారు. అటవీ శాఖ అధికారులు ఓ రాబందును రక్షించి జూపార్క్‌కు తరలిస్తే అది ఒక గుడ్డు పెట్టి పిల్లకు జన్మనిచ్చింది.
మూడు నెలల మేటింగ్ సీజన్ ఏకాంతమే.. రేపటి పులి పిల్లలకు పునాది. అడవిలో పులుల గర్జన తగ్గినా.. తెలంగాణ అడవుల్లో పులుల భవిష్యత్తు మరింత బలపడుతోంది. వన్యప్రాణుల పిల్లల అడుగులతో తెలంగాణ అడవుల్లో కొత్త సందడి మొదలైంది.. పక్షుల కిలకిలరావాలతో ప్రకృతి మరింత కళకళలాడుతోంది. అడవిని కాపాడితేనే.. ఈ కొత్త తరాన్ని కాపాడినట్టు!
ముగియనున్న మేటింగ్ సీజన్
టైగర్ రిజర్వుల్లో జులై1 నుంచి సెప్టెంబర్ 30 వరకు పులుల సంతానోత్పత్తి కాలంగా పరిగణిస్తూ మానవ సంచారాన్ని తగ్గిస్తూ సఫారీ యాత్రలను అటవీశాఖ అధికారులు నిలిపివేశారు. ఈ మూడు నెలల్లో పులులు జతకట్టేందుకు ఏకాంత ప్రాంతాలను ఎంచుకుంటాయి. మనుషుల సంచారం, వాహనాల శబ్దం వంటి అంతరాయాలు వాటి సహజ ప్రవర్తనకు ఆటంకం కలిగించే అవకాశం ఉండటంతో అటవీశాఖ పర్యాటక కార్యకలాపాలపై ఆంక్షలు విధించింది.
హైదరాబాద్‌లోని నెహ్రూ జంతు ప్రదర్శనశాలలోనూ వన్యప్రాణుల సంభోగ, సంతానోత్పత్తి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అడవుల్లో వన్యప్రాణుల సంతానోత్పత్తి (బ్రీడింగ్ సీజన్) సమయం చాలా ముఖ్యమైంది. ఈ కాలంలో జంతువులు జత కలిసి పిల్లలకు జన్మనిచ్చేందుకు వీలుగా ప్రశాంత వాతావరణం కల్పించడానికి అటవీ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంది. వన్యప్రాణుల సంతతిని పెంచడానికి అటవీ అధికారులు ప్రతి రేంజ్‌లోనూ ప్రత్యేక నిఘా, సంరక్షణ చర్యలు చేపట్టారు.