Reading Time: 2 minutes

విహారం కాదు.. విశ్వాసంతో ప్రయాణం… ఇండియాలో 48 శాతం ప్రయాణాలు తీర్థయాత్రలే..!

Caption of Image.

ట్రావెల్‌ అనగానే మన కళ్ల ముందు బీచ్‌లు, కొండలు, హిల్‌స్టేషన్లు, వీకెండ్‌ గెట్‌వేలు మెదులుతాయి. కానీ మనవాళ్ల అసలు ప్రయాణ కథ మాత్రం కాస్త భిన్నంగా ఉంది. ఇక్కడ చాలామందికి ప్రయాణం అంటే విహారయాత్ర మాత్రమే కాదు.. విశ్వాసంతో మొదలయ్యే ఓ ప్రయాణం.  

దేశంలో రాత్రి బసతో జరిగే ప్రతి 100 దేశీయ ప్రయాణాల్లో దాదాపు 48 ప్రయాణాలు తీర్థయాత్రలు, మతపరమైన కారణాలతోనే సాగుతున్నాయి. అంటే.. భారత పర్యాటక రంగానికి బలమైన ఇంధనం భక్తి కూడా అన్నమాట. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్‌‌ స్టాటిస్టిక్స్‌‌ ఆఫీస్‌‌ నిర్వహించిన తాజా డొమెస్టిక్‌‌ టూరిజం ఎక్స్‌‌పెండిచర్‌‌ సర్వే ఈ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. 

2025 జులై నుంచి 2026 జూన్‌‌ వరకు జరిగిన ఈ సర్వేలో దేశవ్యాప్తంగా 2,46,113 కుటుంబాల నుంచి సమాచారం సేకరించారు. ప్రజలు ఎందుకు ప్రయాణిస్తున్నారు? ఎంతకాలం ఉంటున్నారు? ఎలా వెళ్తున్నారు? ఎక్కడ బస చేస్తున్నారు? ఎంత ఖర్చు చేస్తున్నారు? వంటి అంశాలను ఇందులో పరిశీలించారు.

మతపరమైన, తీర్థయాత్రలు గ్రామీణ, పట్టణ ప్రాంతాలు రెండింటిలోనూ 48 శాతం వాటాతో మొదటి స్థానంలో నిలిచాయి. అయితే రెండో కారణం మాత్రం రెండు ప్రాంతాల్లో వేర్వేరుగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం కోసం చేసే ప్రయాణాలు 38.4 శాతం ఉండగా, పట్టణాల్లో హాలిడే, లీజర్‌‌, వినోద ప్రయాణాలు 36.4 శాతంగా ఉన్నాయి. 

అంతేకాదు.. భారతీయుల ప్రయాణాలు ఎక్కువగా సుదీర్ఘంగా ఉండవు. దాదాపు 80 శాతం మంది ఐదు రోజులు లేదా అంతకంటే తక్కువ సమయంలోనే తిరిగి వస్తున్నారు. ప్రయాణ సాధనంలోనూ గ్రామీణ, పట్టణ భారతాల మధ్య తేడా కనిపించింది. గ్రామీణ ప్రాంతాల్లో బస్సులు 32 శాతం వాటాతో ముందుండగా, పట్టణాల్లో రైళ్లు 35 శాతంతో అగ్రస్థానంలో ఉన్నాయి. బస విషయానికి వస్తే పట్టణ ప్రయాణికులు హోటళ్లు, గెస్ట్‌‌హౌస్‌‌లను ఎక్కువగా ఎంచుకుంటే.. గ్రామీణ ప్రయాణాల్లో వాణిజ్యేతర వసతుల వాడకం ఎక్కువగా ఉంది.

దేశీయ ప్రయాణాల పరంగా ఉత్తరప్రదేశ్‌‌15.7 శాతం వాటాతో ముందుంది. తమిళనాడు13.4 శాతం, రాజస్థాన్‌‌ 8 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే ఖర్చుల దగ్గర మరో ఆసక్తికరమైన కోణం కనిపించింది. అత్యధిక వ్యయం అయ్యేది హాలిడే ట్రిప్‌‌లపై కాదు.. వైద్య ప్రయాణాలపైనే. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్క హెల్త్‌‌ ట్రిప్‌‌కు సగటున రూ.29,454, పట్టణ ప్రాంతాల్లో రూ.41,649 ఖర్చవుతోంది. హాలిడే, లీజర్‌‌ ట్రిప్‌‌లలో మాత్రం రవాణా ఖర్చే ప్రధాన భారంగా ఉంది. 

మొత్తంగా చూస్తే.. భారతదేశపు టూరిజం కథ కేవలం ‘ఎక్కడికి వెళ్తున్నారు?’ అనే ప్రశ్నకు సమాధానం కాదు. ఎందుకు వెళ్తున్నారు? అన్నదే అసలు కథ. ఆ ప్రశ్నకు తాజా గణాంకాలు చెప్తున్న సమాధానం ఒక్కటే కాదు.. భక్తి, ఆరోగ్యం, విశ్రాంతి, అవసరం.. ఇవన్నీ కలిసి భారతీయుడి ప్రయాణాన్ని నడిపిస్తున్నాయి.

©️ VIL Media Pvt Ltd.