
దానం నాగేందర్పై అనర్హత కారణంగా ఖాళీ అయిన ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఈ క్రమంలో.. తెలంగాణ రక్షణ సేన అధినేత కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన చేశారు.
ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆమె ప్రకటించారు. వంద శాతం పోటీ చేస్తామని, అభ్యర్థి ఎవరు ఏంటనేది త్వరలో ప్రకటిస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అయితదని ఆమె విమర్శించారు.
ఒక పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి ఉండి.. ఇంకో పార్టీలో ఎంపీగా పోటీ చేయడం అంటే.. రాజ్యాంగ నియమాలను ప్రత్యక్షంగా ఉల్లంఘించినట్లేనని ఆమె అభిప్రాయపడ్డారు. అలాంటి పార్టీలకు ప్రజలు మద్దతు ఇచ్చారంటే.. రాజ్యాంగం అక్కర్లేదని.. రూల్స్ అక్కర్లేదని.. ప్రజలే డైరెక్ట్గా చెప్పినట్లు అయితదని కవిత చెప్పారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నామని ప్రజలు చాటి చెప్పాలంటే ఖైరతాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ను ఓడగొట్టాల్సిందేనని ఆమె ప్రకటించారు.
ఉప ఎన్నిక అనివార్యం కావడంతో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో గెలుపు కోసం అన్ని పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ సర్వశక్తులు కూడదీసుకునే పనిలో పడ్డాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మూడో ఉప ఎన్నిక ఇది.
సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ఉప ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్.. ఖైరతాబాద్ను కూడా కైవసం చేసుకుని హ్యాట్రిక్ సాధించాలనే పట్టుదలతో ఉంది. ఇదివరకే రెండు బీఆర్ఎస్ సీట్లలో పాగా వేయగా.. ఇప్పుడు మూడో సీటును కూడా దక్కించుకుని గులాబీ శిబిరానికి సవాల్విసరాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.