Reading Time: < 1 minute
Rahul Gandhi Sir Row Haryana Gujarat Maharashtra Elections Cec

ఓట్ల దొంగతనం వల్ల ప్రజాస్వామ్యం బలహీనపడిందని.. హర్యానా, గుజరాత్, మహారాష్ట్ర ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపించిందని కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ఓటు చోరీపై ఢిల్లీలో రాహుల్ గాంధీ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై మండిపడ్డారు. ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల జాబితా సవరణపై కేంద్ర ఎన్నికల సంఘం తీరును మరోసారి ఎండగట్టారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఓట్లను దొంగిలిస్తే.. ప్రజల ప్రతినిధులు రూపొందించే చట్టాల చట్టబద్ధతపైనా ప్రశ్నలు తలెత్తుతాయని వ్యాఖ్యానించారు.

ఎన్నికల్లో ఓట్ల అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్నా తాము మౌనంగా ఉండబోమని అన్నారు. ఓటర్ల జాబితా సవరణ, ముఖ్యంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) విషయంలో ఎన్నికల కమిషనర్ల అభ్యంతరాలు పట్టించుకోలేదంటూ వచ్చిన నివేదికల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఓటర్లకు సంబంధించిన హక్కులే ప్రజాస్వామ్యానికి పునాది అని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓట్లు అక్రమంగా ప్రభావితం చేస్తే.. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధుల ద్వారా రూపొందే చట్టాలపైనా ప్రశ్నలు తలెత్తుతాయని రాహుల్ గాంధీ అన్నారు.

ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)తో పాటు ఫారం-6 మార్పులు, ఓటర్ల తొలగింపు, పునరుద్ధరణ, ఎన్నికల డేటా నిర్వహణ వంటి అంశాలపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు జాతీయ మీడియా నివేదిక పేర్కొంది. గత 10 నెలల్లో కనీసం 14 సందర్భాల్లో సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి అభ్యంతరాలు నమోదు చేసినట్లు ఆ నివేదిక తెలిపింది. అయితే ఈ నివేదికపై ఎన్నికల సంఘం స్పందిస్తూ.. కమిషనర్ల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండటం నిర్ణయ ప్రక్రియలో భాగమేనని, గత ఏడాది తీసుకున్న నిర్ణయాలన్నీ ఏకగ్రీవంగానే ఉన్నాయని పేర్కొంది.