
ఒకవైపు వినాయక నిమజ్జనాలు.. మరోవైపు భారీ వర్షానికి అవకాశం ఉండటంతో పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీ విడుదల చేశారు. 2026 సెప్టెంబర్ 24న హైదరాబాద్ లో సాయంత్రం సాధారణం నుంచి భారీ వర్షానికి ఛాన్స్ ఉండటంతో ఉద్యోగులు త్వరగా ఇంటికి చేరుకోవాల్సిందిగా సూచించారు.
గురువారం సాయంత్రం పీక్ హవర్స్ సందర్భంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉందని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. భారీ వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ అయ్యే ఛాన్స్ ఉందన్నారు. ఈ కారణంగా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు త్వరగా లాగౌట్ చేసి ఇళ్లకు చేరాల్సిందిగా సూచించారు.
సాయంత్రం ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉండనుండటంతో.. ఇప్పటి వరకు ట్రాఫిక్ పోలీసులు ఇచ్చిన రూట్ మ్యాప్ లను ఫాలో అవుతూ.. ట్రాఫిక్ నుంచి బయటపడాలని సూచించారు.
సెప్టెంబర్ 18 నుంచి 25 వరకు వినాయక చవితి పురస్కరించుకుని సాయంత్రం వీలైనంత తొందరగా నగరవాసులు ఇళ్లలోకి చేరాలని ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు అడ్వైజరీ విడుదల చేశారు. ముఖ్యంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి ట్రాఫిక్ ఉండనుండటంతో వర్క్ ఫ్రమ్ హోమ్ కు ప్రాధాన్యతను ఇవ్వాల్సిందిగా కంపెనీలకు కూడా పోలీసులు సూచనలు జారీ చేశారు.
సెప్టెంబర్ 25న మహానిమజ్జనం ఉండటంతో సూచించిన రూట్లను వాహనదారులు అవాయిడ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాల కోసం Hyderabad Traffic Police @HYDTP ని ఫాలో కావాలని సూచించారు. ట్రాఫిక్ హెల్ప్ లైన్ 9010203626, ట్రాఫిక్ కంట్రోల్ 8712660600 నెంబర్లకు ఫోన్ చేసి కూడా సమాచారం పొందవచ్చు.