
- గతేడాది రూ.35 లక్షలు
- ఈసారి ఎంత పలుకుతుందోనన్న చర్చ
ఎల్బీ నగర్, వెలుగు: గణేశ్ పండుగ వచ్చిందటే అందరి దృష్టి బాలాపూర్లడ్డూపైనే ఉంటుంది. లడ్డూను వేలంలో గెలుచుకుంటే కోరుకున్న కోరికలు నెరవేరుతాయనే ప్రచారం ఉంది. అలాగే, లడ్డూను దక్కించుకోవడాన్ని ప్రతిష్టకు సంబంధించిన అంశంగా తీసుకోవడంతో ప్రతిసారీ తీవ్రమైన పోటీ ఉంటోంది. దీంతో ఈ లడ్డూను ఎవరు దక్కించుకుంటారన్న దానిపై కాకుండా ఎంతకు దక్కించుకుంటారన్నదానిపైనే ఫోకస్అయి ఉంది. ఇక్కడ 1994లో రూ.450తో ప్రారంభమైన వేలం పాట 2025లో రూ.35 లక్షల వరకు చేరుకుంది.
ఎప్పుడెప్పుడు ఎవరంటే..
గత ఏడాది కర్మన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ గౌడ్ అనే భక్తుడు అత్యధికంగా రూ.35 లక్షలకు 21 కిలోల లడ్డూను కైవసం చేసుకున్నారు. 2024లో రూ. 30,01,000 కి కొలను శంకర్ రెడ్డి, 2023లో రూ. 27 లక్షలకు దాసరి దయానంద్ రెడ్డి, 2022లో రూ. 24,60,000 కు కె. లక్ష్మారెడ్డి, 2021లో రూ. 18,90,000 కు రమేష్ యాదవ్, మర్రి శశాంక్ రెడ్డి గెల్చుకున్నారు. 2020లో కరోనా కారణంగా వేలం వేయలేదు.
ఈసారి బరిలో 9 మంది
ఈసారి వేలంలో పాల్గొనడానికి 8మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇందులో వనస్థలిపురం సాహెబ్ నగర్ కు చెందిన అర్బన్ గ్రూప్ సామ ప్రణీత్ రెడ్డి, చంపాపేట కు చెందిన మర్రి రవికిరణ్ రెడ్డి, చంపాపేటకు చెందిన కేవీఆర్ ఫ్లవర్మర్చంట్కందాడ శాలిని వీరేందర్ రెడ్డి, హస్తినాపురానికి చెందిన కంచర్ల శివారెడ్డి, జీఎన్ఆర్ డెవలపర్స్ గడ్డం నవీన్ రెడ్డి, బాలాపూర్ కు చెందిన ఇబ్రామ్ ప్రత్యూష్, పీఎస్ కే గ్రూప్ శ్రీకాంత్, ది సుషీ కంపెనీ కి చెందిన లండన్ సెటిలర్స్..సామ దయానంద్ రెడ్డి, సామ వరానంద్ రెడ్డి ఉన్నారు.
ఇలా మొదలవుతుంది..
శుక్రవారం ఉదయం 5 గంటలకు బాలాపూర్ గణేశుడికి చివరి పూజ చేస్తారు. 6:30 గంటలకు విగ్రహాన్ని మినీ ట్రక్కుపై ప్రతిష్ఠించి, 7 గంటలకు బాలాపూర్ గ్రామ ప్రదక్షిణ చేస్తారు. 9 గంటలకు గ్రామ బొడ్రాయి వద్దకు చేరుకుని 9:30 గంటలకు వేలం ప్రారంభిస్తారు. 10 గంటలకు శోభాయాత్ర ట్యాంక్‌బండ్ వైపు ప్రారంభమవుతుంది.