
ఏపీకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రంలో పలు కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఈ మేరకు కుప్పం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌కు రక్షణశాఖ నుంచి అనుమతి లభించింది. రక్షణశాఖ నుంచి ఎన్‌ఓసీ రావడంతో త్వరలోనే ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించేందుకు అడుగులు పడుతున్నాయి. అంతేకాకుండా భూసేకరణకు కూడా లైన్ క్లియర్ అయినట్లయింది. త్వరలో భూసేకరణ చేపట్టనుండగా.. మిగిలిన అంశాలపై కూడా అధికారులు దృష్టి పెట్టనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో ఎయిర్ పోర్ట్ నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ద పెట్టారు. ఎప్పటికప్పుడు ప్రత్యేక శ్రద్ద తీసుకుని కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నారు.
కుప్పం ఎయిర్‌పోర్ట్ కోసం 1848 ఎకరాలు
కుప్పం ఎయిర్‌పోర్ట్ కోసం మొత్తం 1848 ఎకరాల భూమి అవసరం అవుతుందని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే 800 ఎకరాల భూసేకరణ కోసం పూర్తయింది. భూసేకరకు పరిహారం కూడా చెల్లించడం పూర్తయింది. ఇక మిగతా భూసేకరణ కోసం రూ.163 కోట్లు అవసరం కానుండగా.. వీటి మంజూరు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం నుంచి నిధులు అందగానే భూసేకరణ ప్రక్రియ మళ్లీ షురూ చేయనున్నారు. 1848 ఎకరాల్లో 900 ఎకరాలను కమర్షియల్ అవసరాలకు ఉపయోగించనుండగా.. కొంతభూమిని వ్యాపార అవసరాల కోసం కేటాయిస్తారు. ఇక మిగిలిన భూమిలో ఎయిర్ పోర్ట్ నిర్మాణం చేపట్టనున్నారు. ఇక ఎయిర్ పోర్ట్ ప్రతిపాదించిన ప్రాంతంలో రెండో అప్రోచ్ రోడ్లను నిర్మించనున్నారు.
కుప్పం ఎయిర్‌పోర్ట్‌పై చంద్రబాబు ప్రకటన
కుప్పం ఎయిర్‌పోర్ట్‌పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. త్వరలోనే ఎయిర్‌పోర్ట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తామని స్పష్టం చేశారు. ఇటీవల కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించగా.. అనంతరం ఎయిర్‌పోర్ట్ పురోగతిపై ప్రకటన చేశారు. కుప్పంను బెంగుళూరు, చైన్నై, కేజీఎఫ్, కృష్ణగిరి లాంటి ప్రాంతాలను కనెక్ట్ చేసేలా జాతీయ రహదారులను నిర్మిస్తామన్నారు. అలాగే కుప్పం టు పొగురుపల్లి నుంచి బెంగుళూరుకు ఓ ప్రత్యామ్నాయ రోడ్డు వస్తుందని స్పష్టం చేశారు. కుప్పంలో ఎయిర్ పోర్ట్ కోసం ఎప్పటినుంచో ప్రతిపాదనలు ఉండగా.. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక స్పీడ్ పెరిగింది. కేంద్రం నుంచి అనుమతులు రావడంతో పాటు భూసేకరణ ప్రక్రియ కూడా వేగవంతమైంది. ఈ ఏడాదిలోనే కుప్పం ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేసే అవకాశముందని తెలుస్తోంది. కేంద్రం నుంచి అనుమతులు తీసుకురావడంపై చంద్రబాబు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. దీంతో కుప్పం ఎయిర్‌పోర్ట్ పనులపై ముందడుగు పడుతోంది.