
గణేష్ నిమజ్జనం సేవల్లో భాగంగా హైడ్రా, జలమండలి భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. 2026 సెప్టెంబర్ 25న ఖైరతాబాద్ బడా గణేష్ తో పాటు సిటీలోని ప్రముఖ వినాయకుల నిమజ్జనం ఉండటంతో ఇటు హైడ్రాతో పాటు అటు జలమండలి సిద్ధం అయ్యాయి.
నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా 234 మంది స్విమ్మర్లను రంగంలోకి దించింది హైడ్రా. హుస్సేన్‌సాగర్‌లో 150 మంది స్విమ్మర్లతో భద్రత చర్యలు చేపట్టింది. మూడు షిఫ్టుల్లో 50 మంది చొప్పున స్విమ్మర్లు సిద్ధంగా ఉంటారు.
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 84 మంది స్విమ్మర్లు సేవలు అందిస్తారు. హైడ్రా స్విమ్మర్లకు తోడు 51 డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొంటాయి. హుస్సేన్‌సాగర్‌తో పాటు ప్రధాన చెరువుల్లో స్విమ్మర్లు భక్తుల భద్రతను పర్యవేక్షించనున్నారు.
కూకట్‌పల్లి ఐడీఎల్ చెరువులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 25 అడుగుల మేర చెరువు తవ్వి నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. ప్రశాంతంగా, సురక్షితంగా నిమజ్జనానికి హైడ్రా చర్యలు తీసుకుంటోంది. ఇతర శాఖలతో సమన్వయంతో హైడ్రా ఏర్పాట్లు చేసింది.
జలమండలి ఆధ్వర్యంలో 137 ప్రత్యేక తాగునీటి శిబిరాలు:
వినాయక నిమజ్జనానికి జలమండలి విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. భక్తుల కోసం 137 ప్రత్యేక తాగునీటి శిబిరాలు ఏర్పాటు చేసింది. 90 బేబీ పాండ్స్ వద్ద తాగునీటి క్యాంపులు సిద్ధం చేశారు. ప్రధాన శోభాయాత్ర మార్గాల్లో ప్రత్యేకంగా 12 వాటర్ క్యాంపులు నిర్వహిస్తున్నారు.
ట్యాంక్‌బండ్, సచివాలయం పరిసరాల్లో వాటర్ క్యాంపులు ఏర్పాటు చేశారు. భక్తుల కోసం 40 లక్షల వాటర్ ప్యాకెట్లు సిద్ధం చేశారు. అవసరమైన ప్రాంతాల్లో డ్రమ్ముల ద్వారా మంచినీటి సరఫరా చేయనున్నారు. తాగునీటి శిబిరాల పర్యవేక్షణకు నోడల్ అధికారులను నియమించింది. ప్రతి ఏరియాకు ప్రత్యేక రూట్ అధికారులు ఉంటారు.
మూడు రీజియన్లలో ఈడీల పర్యవేక్షణ ఉంటుంది. శోభాయాత్ర మార్గాల్లో లీకేజీలు, సీవరేజీ ఓవర్‌ఫ్లోలపై ప్రత్యేక నిఘా పెంచారు. అవసరమైన ప్రాంతాల్లో సీవర్ జెట్టింగ్ యంత్రాలు సిద్ధం చేశారు. అన్నదాన శిబిరాలకు ఉచితంగా వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయనున్నారు.
వాటర్ క్యాంపుల్లో నీటి నాణ్యతపై QAT బృందాల పర్యవేక్షిస్తాయి. నిర్దిష్ట స్థాయిలో క్లోరిన్ ఉండేలా నిరంతర తనిఖీలు చేస్తారు. పోలీసులు, GHMC, హైడ్రా, ఉత్సవ కమిటీలతో సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లు చేస్తున్నారు. 72 గంటలు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా జలమండలి ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు.