
పైరసీతో సినీ ఇండస్ట్రీని ముప్పతిప్పలు పెట్టిన ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’ (iBomma) కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులోని ప్రధాన నిర్వాహకుడు, నిందితుడు రవికి నాంపల్లి కోర్టులో స్పల్ప ఊరట లభించింది. దర్యాప్తులో భాగంగా గతంలో పోలీసులు సీజ్ చేసిన ఆయన బ్యాంకు ఖాతాలను రోజువారీ లావాదేవీల నిమిత్తం తిరిగి ఉపయోగించుకోవచ్చని న్యాయస్థానం పచ్చజెండా ఊపింది. అయితే, అదే సమయంలో ఖాతాల్లో నిలిచిపోయిన రూ.3 కోట్ల నగదును అన్‌ఫ్రీజ్ చేసేందుకు మాత్రం కోర్టు తీవ్రంగా నిరాకరించింది.
ఖాతాలన్నీ ఫ్రీజ్ కావడం వల్ల తాను తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నానని.. కనీసం కుటుంబ నిర్వహణ కూడా భారంగా మారిందని రవి తరఫు న్యాయవాది కోర్టులో పిటిషన్ వేశారు. సీజ్ చేసిన రూ.3 కోట్ల నగదును తక్షణమే రిలీజ్ చేసేలా పోలీసులకు ఆదేశాలివ్వాలని అభ్యర్థించారు. పిటిషన్‌ను క్షుణ్ణంగా విచారించిన న్యాయమూర్తి, కేవలం వ్యక్తిగత అవసరాలు , భవిష్యత్ లావాదేవీల కోసం ఆయా బ్యాంక్ అకౌంట్లను ఆపరేట్ చేసుకోవడానికి మాత్రమే అనుమతించారు. కానీ, అంతకుముందు ఆ ఖాతాల్లో డిపాజిట్ అయి ఉన్న రూ. 3 కోట్ల భారీ మొత్తాన్ని మాత్రం విత్‌డ్రా చేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు.
సినిమా పరిశ్రమకు కోట్లాది రూపాయల నష్టం చేకూరుస్తూ, కొత్త సినిమాలను అక్రమంగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో అప్‌లోడ్ చేసిన ఆరోపణలతో ఐబొమ్మ నిర్వాహకులపై గతంలో పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసుపై మరింత లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. కోర్టు తీర్పుతో అకౌంట్లు వాడుకునే వెసులుబాటు దక్కినా, రూ. 3 కోట్లు చేతికి రాకపోవడంతో ఐబొమ్మ రవికి ఇది తాత్కాలిక ఊరట మాత్రమే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మున్ముందు ఈ కేసులో ఇంకెన్ని కీలక మలుపులు చోటుచేసుకుంటాయో వేచి చూడాలి.