Reading Time: < 1 minute
యానాం మార్కెట్‌లో చీరమేను సందడి.. బకెట్‌ ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

యానాం: శీతాకాలం ప్రారంభం కావడంతో యానాం మార్కెట్‌లో అరుదైన చీరమేను సందడి మొదలైంది. మాంసాహార ప్రియులు ఎంతో ఇష్టంగా తినే ఈ చేపలు ఈ ఏడాది తొలిసారిగా మార్కెట్‌కు చేరడంతో కొనుగోలుదారుల ఆసక్తి పెరిగింది. తొలి బకెట్‌ చీరమేను వేలంలో ఏకంగా రూ.26 వేలకు అమ్ముడైంది.

స్థానిక మత్స్యకార మహిళ నాటి పార్వతి ఈ బకెట్‌ను వేలంలో దక్కించుకున్నారు. అనంతరం చీరమేనును సేరు రూ.4 వేల చొప్పున విక్రయిస్తున్నట్లు మత్స్యకారులు తెలిపారు. దీంతో మార్కెట్‌లో చీరమేను కొనుగోలు చేసేందుకు మాంసాహార ప్రియులు ఆసక్తి చూపుతున్నారు.

చీరమేను ప్రధానంగా తూర్పు గాలులు వీచే సమయంలో మత్స్యకారులకు లభిస్తుందని స్థానికులు చెబుతున్నారు. నీటి అడుగు భాగంలో ఉండే ఈ చిన్న చేపలు తూర్పు గాలుల ప్రభావంతో నీటి ఉపరితలానికి చేరుకుంటాయని మత్స్యకారులు వివరించారు. ఇవి చాలా చిన్నగా ఉండటంతో గతంలో చీరల సాయంతో పట్టుకునేవారని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రత్యేకంగా తయారు చేసిన సన్నని వలలను ఉపయోగించి వీటిని పట్టుకుంటున్నారు.

ఇటీవల తుపాన్ ప్రభావంతో తూర్పు గాలులు వీస్తుండటంతో చీరమేను పట్టుకునేందుకు పలువురు మత్స్యకారులు వేటకు వెళ్తున్నారు. సీజన్‌ ప్రారంభం కావడంతో రానున్న రోజుల్లో మార్కెట్‌కు మరింతగా చీరమేను వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

చీరమేనుతో స్థానికులు పలు రకాల వంటకాలు తయారు చేసుకుంటారు. ముఖ్యంగా చింతకాయ, నిమ్మకాయతో ఇగురు, గారెలు వంటి వంటకాలను చేసుకుని ఆరగిస్తారు. ఇప్పటి నుంచి దీపావళి వరకు చీరమేను లభ్యత ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో మత్స్యకారులు ప్రత్యేక వలలతో వేట కొనసాగించనున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..